మనుషులు ప్రతి చిన్న కారణానికి కొట్టుకుంటున్నారు. కలహించుకుంటున్నారు. కానీ జంతువులు మాత్రం వేర్వేరు జాతులకు చెందిన ఒకదానిని మరొకటి కాపాడుకుంటున్నాయి. ఇటీవల గుజరాత్ లోని గిర్ అడవుల్లో కనిపించిన అత్యంత అరుదైన దృశ్యం ఇదే విషయాన్ని తెలియచేస్తుంది.

మామూలుగా సింహం, చిరుతలు ఒకే అడవిలో నివసించినా పరస్పరం బద్ధ శత్రువుల్లా వ్యవహరిస్తాయి.  ఒకరినొకరు చంపుకునేందుకే ప్రయత్నిస్తాయి. అలాంటిది గత నెల రోజులుగా ఒక ఆడ సింహం ఒక చిరుత కూనకు తల్లిగా వ్యవహరిస్తోంది. దాన్నికాపాడుతోంది. దానికి స్తన్యాన్నిస్తోంది. ఈ రెండు జాతుల మధ్య ఇలాంటి ప్రేమ అసాధ్యం. ఇప్పటి వరకూ ఇలా జరిగిన దాఖలాలు లేవు.

సముద్రంలోని ఎలిఫెంట్ సీల్స్, సీ లయన్స్ ఇలా అనాథలైన తమ జాతి పిల్లలను సాకిన సంఘటనలున్నాయి. కోతి, కుక్కలు కలిసి మెలిసి ఉన్న దాఖలాలున్నాయి. కొన్నిసందర్భాల్లో తిమింగలం పిల్లలను డాల్ఫిన్స్ సాకిన ఉదాహరణలూ ఉన్నాయి. కానీ సింహం, చిరుత కలిసి జీవించిన ఉదాహరణలు లేవని జంతు సహవాస విషయాల అధ్యయనం చేసే నిపుణురాలు స్తోత్ర చక్రవర్తి చెప్పారు. చిరుత కూన  ఫిబ్రవరి 11, 2019 నాడు చనిపోయే దాకా, దాదాపు 29 రోజులు సింహం దానికి పాలు పట్టింది. పరిచర్యలు చేసింది. సొంత సంతానంలా చూసుకుంది.

అయితే చిరుత కూనకు పుట్టుకతోనే కాలి ఎముకకు సంబంధించిన వ్యాధి ఉందని, దానితోనే అది చనిపోయిందని పరిశోధకులు చెబుతున్నారు. నిజానికి చిరుత కూనకు కాస్త దూరంలోనే ఒక ఆడ చిరుత ఉందని, కానీ అది తన బిడ్డను పట్టించుకోవడం లేదని, ఆడసింహమే ఆ బాధ్యత తీసుకుందని పరిశోధకులు చెబుతున్నారు. ఆడ సింహానికి కూడా కూనలున్నాయని. వాటిని చూసుకుంటూనే చిరుత కూనను కూడా చేరదీసిందని, అయితే అది తన బిడ్డలకే ప్రాధాన్యం ఇచ్చిందని ఈ రెండు జంతువుల సహజీవనాన్ని పరిశీలించిన నిపుణులు చెబుతున్నారు.

అది చిరుత కూనను దాదాపు దత్తత తీసుకున్నట్టుగా వ్యవహరించిందని, దానిలోని పాల ఉత్పాదనకు సంబంధించిన హార్మోన్ల వల్లే అది ఇలా ప్రవర్తించి ఉండవచ్చునని వారు భావిస్తున్నారు. గతంలో ఇలాంటి సంఘటన 2017 లో టాంజానియాలోని న్గోంగొరో సంరక్షిత ఏరియాలో నమోదైంది. అయితే ఒక రోజు వరకూ మాత్రమే సింహం చిరుతను సాకింది. ఆ తరువాత దానిని పట్టించుకోలేదు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.