ఈ ఏడాది విద్యార్థులకు..వచ్చే ఏడాది నేరుగా తల్లుల ఖాతాలోకే..

By రాణి  Published on  28 April 2020 9:05 AM GMT
ఈ ఏడాది విద్యార్థులకు..వచ్చే ఏడాది నేరుగా తల్లుల ఖాతాలోకే..

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన పదకాన్ని ప్రారంభించారు. ఈ పదకం ద్వారా ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకూ పెండింగ్ లో ఉన్న రూ. 1880 కోట్ల బకాయిలను చెల్లిస్తున్నామన్నారు. ఈ ఏడాది వరకూ మాత్రం ఫీజు రీయంబర్స్ మెంట్ విద్యార్థుల ఖాతాల్లో జమ అవుతాయి..2020-2021 విద్యాసంవత్సరం నుంచి ప్రతి త్రైమాసికం తర్వాత ఫీజు రీయంబర్స్ మెంట్ నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అవుతాయని సీఎం వెల్లడించారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాన్ని కూడా జగన్ తెలిపారు. నేరుగా తల్లుల ఖాతాల్లోకి ఫీజు రీయంబర్స్ మెంట్ వేయడం వల్ల వారు కాలేజీ యాజమాన్యాన్ని ఫీజుల విషయంలో ఏవైనా తలనొప్పులొస్తే ప్రశ్నించే వీలుంటుందన్నారు. తమ పిల్లలు చదువుతున్న కాలేజీల్లో టీచింగ్‌ స్టాఫ్‌ బాగా లేకపోయినా, వసతులు బాగా లేకున్నా ప్రశ్నించే అవకాశం వారికి ఉంటుందన్నారు.

Also Read : వసతి దీవెన..విద్యా దీవెన..జగనన్న విద్యాదీవెన

అదేవిధంగా ప్రతి 3 నెలలకోసారి డబ్బులు కట్టడానికి వెళ్లడం వల్ల తమ పిల్లలు ఎలా చదువుతున్నారు? వారు సక్రమంగా కాలేజీలకు వెళ్తున్నారా? లేదా? అనే విషయాలపై కూడా తల్లిదండ్రులకు ఒక అవగాహన ఏర్పడుతుందన్నారు. తాను తీసుకున్న ఈ నిర్ణయం ఒక కొత్త ఒరవడికి నాంది పలుకుతుందని గర్వంగా చెప్పారు జగన్.

వసతి దీవెన కింద రూ.20వేలు

చదువుకోవడం కోసం కళాశాల హాస్టల్లో ఉండే విద్యార్థులకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఏర్పాట్లకై ఏడాదికి రూ.20 వేలు ఇస్తున్నామన్నారు. ఇవి కూడా తల్లి అకౌంట్లోనే జమ అవుతాయన్నారు. ఈ విధంగా చేయడం వల్ల కుటుంబాలు అప్పుల పాలు కాకుండా ఉంటాయని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంత కష్టకాలంలో సైతం మా ఇబ్బందులను మరిచి..మీ ఇబ్బందులను గ్రహించి ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు తీసుకున్నవారితోపాటు..పై తరగతులకు ప్రమోట్ అయిన విద్యార్థులకు కూడా పూర్తి ఫీజు రీయంబర్స్ మెంట్ ను వర్తింపజేస్తున్నట్లు జగన్ వెల్లడించారు.

ఆ డబ్బును తిరిగి వెనక్కి తీసుకోండి

ఎవరైనా తల్లిదండ్రులు ఇప్పటికే కాలేజీలకు ఫీజులు చెల్లించి ఉంటే ఆ డబ్బును కాలేజీ యాజమాన్యం నుంచి తిరిగి వెనక్కి తీసుకోవాలని, ఈ మేరకు కాలేజీల యాజమాన్యాలు కూడా సహకరించాలని కోరారు సీఎం జగన్. ఇప్పటి నుంచి పూర్తి ఫీజు రీయంబర్స్ మెంట్స్ వర్తింప జేస్తున్నాం కాబట్టి ఎవరూ సొంత డబ్బులతో ఫీజులు కట్టొద్దన్నారు. ఈ విషయంలో ఎవరికైనా ఇబ్బందులు తలెత్తితే 1902 కి కాల్ చేయవచ్చని, వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తామని సీఎం జగన్ విద్యార్థులు, తల్లిదండ్రులకు హామీనిచ్చారు.

Next Story
Share it