ఫీవర్ కంటే ఫీజులకే భయం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Sep 2019 8:14 AM GMT
ఫీవర్ కంటే ఫీజులకే భయం..!

* టెస్ట్ ఖర్చులు తడిసిమోపెడు

* దోచుకుంటున్న, డాక్టర్లు, డయాగ్నస్టిక్ సెంటర్లు

* అధికారుల చోద్యం

హైదరాబాద్ : విషజ్వరాల భారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. రోగుల భయాన్ని కొందరు ప్రైవేటు డాక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు. పేద, ధనిక భేదం లేకుండా దోచుకుంటున్నారు ప్రైవేటు డాక్టర్లు. వైద్యో నారాయణ హరి అనే పదానికి ప్రైవేటు డాక్టర్లు కొత్త అర్ధం చెబుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో జలుబు, దగ్గు, జ్వరాలు వస్తుండటంతో రోగులు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల కంటే మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే అక్కడి డాక్టర్లు నిలువునా రోగులను దోచుకుంటున్నారు.

డబ్బు సంపాదనే ..!

మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రభుత్వ పర్యవేక్షణ కూడా లేనట్లు కనిపిస్తోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫలానా రోగానికి ఇంత ఖర్చు అనే పట్టికలు సూచన ప్రాయంగా కూడా లేకపోవడంపై రోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో నాణ్యమైన డాక్టర్లు కొరత కూడా వేధిస్తుంది. అయినా..డబ్బులు దండుకోవడంలో మాత్రం కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఏ మాత్రం ఆలోచించడంలేదు.

అవసరం లేకపోయినా మందులు..!

ఇక..ప్రైవేటు ఆస్పత్రులు కొన్ని డయాజ్ఞస్టిక్‌ సెంటర్లతో కానరాని ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. అవసరం ఉన్నా లేకున్నా పరీక్షలు రాస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. సొమ్ము చేసుకోవడానికే ఇలా రాస్తున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఫార్మా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నాయని విమర్శిస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా మందులు రాస్తూ రోగులను దోచుకుంటూన్నారనే విమర్శలు పెరుగుతున్నాయి.

రోగి బలహీనతే క్యాష్..!

విషజ్వరాలతో పేషెంట్లు కళ్ల ముందే చనిపోతుంటే ఆస్పత్రుల్లో ఉన్న రోగులు భయాందోళనకు గురి అవుతున్నారు. జబ్బుల నుంచి బయటపడటానికి ఎంతైనా ఖర్చు చేయడానికి వెనకాడటంలేదు. ఈ బలహీనతనేప్రైవేటు ఆస్పత్రులకు వరంగా మారుతుంది. ప్లేట్లెట్లు తగ్గించి రోగితో ఆడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్లేట్లెట్లు ఎక్కించాలని డబ్బులు దోచుకుంటున్నారని పేషెంట్ల బంధువులు ఆరోపిస్తున్నారు.

పాలకుల్లారా పట్టించుకోండి..!

అప్పోసప్పో చేసి రోగుల ప్రాణాలు కాపాడేందుకు కుటుంబ సభ్యులు పరుగులు తీస్తున్నారు. ఇంత తంతు జరుగుతున్నా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఫీవర్ బాధ కంటే డాక్టర్ల ఫీజులు రోగులను భయపడుతున్నాయి. ఇకనైనా నిర్లక్ష్యం వీడి ప్రైవేటు ఆసుపత్రుల దోపీడీని అరికట్టాలని ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story