అనుష్క శర్మ ఎందుకు ఫీలయ్యింది..? ఆమెను అంతగా బాధ పెట్టింది ఎవరు..?

By సత్య ప్రియ  Published on  1 Nov 2019 5:55 AM GMT
అనుష్క శర్మ ఎందుకు ఫీలయ్యింది..? ఆమెను అంతగా బాధ పెట్టింది ఎవరు..?

ఫరూక్ ఇంజినీర్ వ్యాఖ్యలు భారత క్రికెట్ రంగం లో దుమారం రేపుతున్నాయి. ఇంగ్లాండ్ లో ప్రపంచకప్ సందర్భంగా కొహ్లీ భార్య అనుష్కా శర్మ సెలక్టర్ల బాక్స్ లో కూర్చుందని, సెలక్టర్లు ఆమెకు టీలు అందించారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత జట్టుపైనే కాదు, భారత సెలక్టర్ల పైన కూడా ప్రభావం చూపిస్తున్నాడని, ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని "మిక్కీ మౌస్ సెలక్షన్ కమిటీ" గా ఆయన అభివర్ణించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"సెలక్టర్లుగా ఉండేందుకు తగిన అర్హతలు కూడా వారికి లేవు, అందరూ కలిసి 10-12 టెస్టులే ఆడారు, నాకు ఆ సెలక్టర్ల పేర్లు కూడా తెలియదు. ఎవరు నువ్వు అంటే, నేను సెలక్టర్ ని అని చెప్పాడు. అనుష్క శర్మకి టీ తెచ్చివ్వడమే ఈ సెలక్టర్ల పని" అంటూ ఎద్దేవా చేశారు. దిలీప్ వెంగ్ సర్కార్ స్థాయి వ్యక్తి సెలక్టర్ గా ఉండాలని ఫరూక్ అభిప్రాయపడ్డారు.

అయితే, ఆయన వ్యాఖ్యలు దేశంలో దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను అనుష్క తీవ్రంగా ఖండించింది. ఫరూక్ దురుద్దేశంతో అబద్ధాలు ఆడుతున్నాడని ఆమె చెప్పింది. సెలక్టర్ల గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే మాట్లాడుకోవచ్చు, కానీ అందులోకి తనను లాగి అనవసర వ్యాఖ్యలు చేస్తే ఊరుకోనని ట్విట్టర్ లో తెలిపింది.



ఫరూక్ వ్యాఖ్యల పై సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా మండిపడ్డారు. సరైన ప్రక్రియ ద్వారానే బీసీసీఐ తమను సెలక్టర్లుగా ఎంపిక చేసిందని, 82 ఏళ్ల ఫరూక్ తన వయసుకు తగిన పరిణతి చూపాలని ఆయన అన్నారు.

అయితే, ఇప్పుడు ఫరూక్ తన వ్యాఖ్యల నుంచి మరలుతున్నట్టు కనిపిస్తోంది. ఒక టివి చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారు అన్నారు. “అనుష్క మంచి అమ్మాయి, ఈ వివాదంలోకి ఆమె ను అనవసరంగా లాగుతున్నారు. అనుష్కా ను ఎప్పుడూ విమర్శించలేదు, ఈ వ్యాఖ్యల వల్ల ఆమె నొచ్చుకున్నందున ఆమె కు క్షమాపణ చెప్తున్నాను. నేను సెలక్టర్లు వారి బాధ్యతలు సరిగా నిర్వర్తించడం లేదు అని అన్నానే కానీ, విరాట్, అనుష్కల గురించి వ్యాఖ్యానించలేదు", అని అన్నారు ఫరూక్.

Next Story