అమరావతి పరిరక్షణ సమితి ఐకాస, రాజధాని రైతులు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తో కలిసి రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. ఏపీ రాజధాని తరలింపు విషయంలో రాష్ర్టపతి జోక్యం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. అలాగే 52 రోజులుగా రాజధాని కోసం రైతులు చేస్తున్న ఆందోళనలను రాష్ర్టపతి దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి రాజధానిని అమరావతి నుంచి తరలించకుండా చూడాలని, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని వేడుకున్నారు. రైతులు, మహిళలు, నిరసనకారులపై పోలీసులు అనవసరంగా దాడులు చేస్తున్నారని, శాంతియుతంగా నిరసనలు చేసినా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేలా రాష్ర్ట ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వివరించారు.

మరోవైపు అమరావతే ఏపీ రాజధానిగా ఉంటుందని ప్రకటించేంత వరకూ తమ ఆందోళనలు, దీక్షలు ఆగవని మందడం రైతులు తేల్చి చెప్పారు. 52వ రోజు రైతుల ఆందోళనలు యథాతథంగా కొనసాగుతున్నాయి. అమరావతి నిర్మాణానికి ఇంకా లక్ష కోట్లు కావాలని చెప్పి ప్రజలను నుంచి డబ్బులు లాక్కొనేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అలాగే ఏపీ మూడు రాజధానుల అంశంపై బీజేపీ స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రాణి యార్లగడ్డ

Next Story