బీ “టెక్కు” ల నుంచి రంగురంగుల మొక్కజొన్నల రైతుల దాకా ..

By రాణి  Published on  10 Feb 2020 7:20 AM GMT
బీ “టెక్కు” ల నుంచి రంగురంగుల మొక్కజొన్నల రైతుల దాకా ..

బీ “టెక్కు”లను వదిలేశారు. పట్టణాల నవ నాగరికతను పక్కన బెట్టేశారు. ప్యాంటు మోకాలి పైకి ఎగకట్టారు. బురదలో దిగారు. మట్టిలో పనిచేశారు. జావా స్క్రిప్టులు రాసిన చేతులు ఇప్పుడు రైతులుగా కొత్త రచనలు చేస్తున్నాయి. ఇది అభినవ్ గంగుమళ్ల, రేణు రావుల రైతు సాఫల్య గాథ.

గీతంలో బీటెక్ చేసిన అభినవ్ కు అభినవ నూతనంగా ఏదో చేయాలన్న తాపత్రయం. కార్పొరేట్ ప్రపంచపు పాములు నిచ్చెనల ఆట ఏ మాత్రం నచ్చలేదు. స్వయం సమృద్ధమైన వ్యవసాయం చేయాలన్న తలపు ఇచ్చిన పిలుపు కార్పొరేట్ ఉద్యమాన్ని కాలదన్నేలా చేసింది. బ్యాగూ, సూట్ కేసు సర్దుకుని ఊరొచ్చేశాడు. పొలంలోకి దిగాడు. తోడుగా చిరకాల నేస్తం రేణు రావు కూడా మట్టి మనిషి కావడానికి సిద్ధ పడింది. హైదరాబాద్ లో హైదరాబాద్ గోస్ గ్రీన్ అనే షాపును పెట్టి 2010 నుంచి ఆమె పనిచేస్తోంది. ఆమె, అతను కలిసి నగర శివార్లలో నాలుగున్నర ఎకరాలు కొన్నారు, నాలుగున్నర ఎకరాల్లో నార్త్ అమెరికాకే ప్ర్యతేకమైన మల్టికలర్ కార్న్ ను, పర్పుల్ కార్న్, గ్లాస్ జెమ్ కార్న్, స్ట్రాబెర్రీ కార్న్ ను సాగుచేయడం మొదలుపెట్టారు. “ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపూ సొలుపేమున్నది” అని వ్యవసాయం సాగించారు.

ఈ సక్సెస్ అంత తొందరగా ఏమీ రాలేదు. ఏడేళ్లు ఏకష్టపడాల్సి వచ్చింది. నానా ప్రయోగాలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు రంగురంగుల విలువైన రత్నాల్లా కనిపించే కార్న్ గింజలను సిటీలో కస్టమర్లకు అందిస్తున్నారు. “ఏడేళ్ల తరువాత పంటను చూస్తే కళ్ల నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. ఎన్నో విఫల ప్రయత్నాల తరువాత ఈ సాఫల్యాన్ని కళ్లతో చూడగలిగాను” అంటాడు అభినవ్. “వండిన తరువాత కూడా మొక్కజొన్న గింజల రంగులు పోవు. ఇవే రంగులు క్యారీ అవుతాయి” అని ఆయన హామీ ఇస్తున్నాడు.

వాళ్ల వివిధ వర్ణాల మొక్కజొన్నల్లాగా వారి జీవితాల్లోనూ వేయి వర్ణాలు వెల్లివిరియాలని కోరుకుందాం..

Next Story