నిజ నిర్ధారణ: బేగం బజార్ లోని అపరిశుభ్ర పరిసరాలలో టాటా ఉప్పు తయారీ ??
By సత్య ప్రియ Published on 25 Oct 2019 9:08 AM GMTబేగం బజార్ లోని చిన్న పరిశ్రమలో టాటా ఉప్పును తయారు చేస్తున్నారని వివిధ సోషల్ మీడియా మాద్యమాలలో ఒక వీడియో ప్రచారంలో ఉంది. ఆ వీడియోలో కొంత మంది అపరిశుభ్ర పరిసరాలలో టాటా ఉప్పును తయారు చేస్తూ ప్యాకెట్లలో నింపి సీల్ చేస్తున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ మాద్యమాలలో వివిధ ఖాతాలు ఈ వీడియోని ప్రచారం చేసాయి.
ఎందరో ఈ వీడియో నిజమా అని అడుగుతూ ట్విట్టర్లో కూడా పంచుకున్నారు.
నిజ నిర్ధారణ:
వీడియో నుంచి కొన్ని స్క్రీన్ షాట్స్ తీసుకొని రివర్స్ ఇమేజ్ సర్చ్ ద్వారా గూగుల్ లో 'టాటా సాల్ట్ ' అనే పదాలను వాడి సెర్చ్ చేయగా, వివిధ మాధ్యమాల్లో పంచుకోబడిన వీడియో వివరాలు వచ్చాయి. అందులో గురులాకర్ అనే యూట్యూబ్ చానల్ వారు అక్టోబర్ 19, 2019 న ప్రచురించిన వీడియో న్యూస్ మీటర్ కు లభించింది.
వీడియో వివరణలో వారు ఆ వీడియో గురించిన వివరాలు రాసారు. అక్టోబర్ 10వ తారీఖున పంజాబ్ లోని డేర బస్సి అనే ప్రదేశంలో పోలీసులు దాడి చేసారనీ, అక్కడ ఎన్నో నకిలీ పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారని ఉంది.
వీడియోలో నుండి కొన్ని స్క్రీన్ షాట్లను పరిశీలిస్తే అందులో ఒక పోలీసు అధికారి కూడా ఉన్నట్టూ, ఆయన అక్కడ ఉన్న పదార్ధాలను పరిశీలిస్తూన్నట్టూ చూడవచ్చు.
టాటా సాల్ట్ వారి అధికారిక ఫేస్ బుక్, ట్విట్టర్ పేజీలలో అక్టోబర్ 15, 2019న విడుదల అయిన ప్రకటనలో పంజాబ్ లో చిన్న పరిశ్రమ పై పోలీసుల దాడి గురించి వివరాలు చూడవచ్చు.
వీడియో నిజమే అయినప్పటికీ, అందులో ఉన్న వారు నకిలీ టాటా ఉప్పునే తయారు చేస్తున్నప్పటికీ, వీడియోతో పాటు పంచుకున్న వివరాలు నిజం కాదు. ఆ వీడియో బేగం బజార్ కు సంబంధించినది కాదు. పంజాబ్ లోని డేరా బస్సి అనే ప్రాంతానికి చెందినది. అక్టోబర్ 10న ముబరికర్ పోలీసుల తనిఖీ జరుగుతున్న సమయంలో తీసింది. ముంబయి కి సంబంధించిన ఒక కంపనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కేవలం టాటా ఉప్పు మాత్రమే కాకుండా బాబా రాందేవ్ ఉప్పు, ఆశీర్వాద్ పిండి, లాక్మే కాజల్, టైడ్ వంటివాటికి కూడా నకిలీ పదార్ధాలను అక్కడ తయారు చేస్తున్నారు.
దావా: హైదరాబాద్ లోని బేగం బజార్ లో నకిలీ టాటా ఉప్పు తయారీ.
దావా చేసినవారు: ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ఎందరో ఖాతాదారులు
నిజ నిర్ధారణ: ఈ వీడియో బేగం బజార్ కు సంబంధించినది కాదు. పంజాబ్ లోని మొహాలి దగ్గర డేరా బస్సి అనే ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించినప్పటిది.