ఏపీ కొత్త ఎస్ఈసీపై దుష్ప్రచారం
By రాణి Published on 13 April 2020 4:16 PM ISTఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా నియమితులైన జస్టిస్ వి.కనకరాజ్ పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగింది. టీడీపీ అనుకూల సోషల్ మీడియా గ్రూపుల్లో ఎస్ఈసీ కనకరాజ్ ఓ చర్చి పాస్టర్ అంటూ తమిళనాడుకు చెందిన వేరొక వ్యక్తి ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించిన ఎన్నికల కమిషన్ ఈ వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ఎన్నికల కమిషన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఎస్ఈసీ కనకరాజ్ ఫొటోలను చర్చి పాస్టర్ గా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. నిజానికి ఎస్ఈసీ కనకరాజ్ హిందూ దళిత మేధావి అని వైసీపీ వర్గాలు పేర్కొన్నాయి.
Also Read : ప్రింట్ మీడియాపై కరోనా చావుదెబ్బ
కాగా..అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఏపీ నూతన ఎస్ఈసీ గా వి. కనకరాజ్ బాధ్యతలు స్వీకరించారు. ఉన్నట్లుండి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని 5 నుంచి 3 ఏళ్లకు కుదిస్తూ ఆర్డినెన్స్ తీసుకు రాగా అందుకు గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేశారు. దీనిపై టీడీపీ, బీజేపీ వర్గాలతో పాటు ఇతర పార్టీల నేతలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుటాహుటిన రమేష్ కుమార్ పదవీ కాలాన్ని కుదిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చి పదవి నుంచి తొలగించడం, ఆ మర్నాడే కనకరాజ్ చెన్నై నుంచి నేరుగా విజయవాడకు వచ్చి విధులు స్వీకరించడంపై తీవ్ర దుమారమే రేగుతోంది. ఇతర పార్టీల నేతలు, ప్రజలు వేరే ప్రాంతాల నుంచి వస్తే క్వారంటైన్ లో ఉండాలని నిబంధనలు పెడతారు గానీ కొత్తగా వచ్చిన ఎస్ఈసీకి క్వారంటైన్ నియమాలు వర్తించవా ? అని ప్రశ్నిస్తున్నారు.
Also Read :ఎన్ఆర్ఐ మహిళ స్వాతి దేవినేని పై కేసు నమోదు