ఢిల్లీ అల్లర్లపై ఫేక్ పోస్టులతో దుష్ప్రచారం

By రాణి  Published on  9 March 2020 4:41 PM IST
ఢిల్లీ అల్లర్లపై ఫేక్ పోస్టులతో దుష్ప్రచారం

ఢిల్లీలో మతపరమైన ఉద్రిక్తతలు చల్లారిపోయాయి. ప్రజలు మళ్లీ మామూలు గా ఉంటున్నారు. కానీ సోషల్ మీడియా లో మాత్రం మతాల మధ్య, వర్గాల మధ్య చిచ్చుపెట్టే యత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఫేక్ పోస్టులతో, ఫేక్ ఫోటోలతో ఇప్పటికీ వైషమ్యాలు పెంచే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

ఉదాహరణకు ఒక పదమూడేళ్ల బాలిక మతపరంగా చాలా ఉద్రిక్తతలున్న జాఫ్రాబాద్ ప్రాంతంలో సామూహిక అత్యాచారానికి గురైందన్న వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంకో మతానికి చెందిన ముష్కరులు ఆమెను రేప్ చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే కాసింత్ ఫ్యాక్ట్ చెక్ చేస్తే రేప్ బాధితురాలి ఫోటో 2018 నాటిదని తేలింది. వుయ్ ఆర్ ఆల్ గర్ల్స్ అనే ఫేస్ బుక్ పేజీలో జనవరి 2018 లో ఈ ఫోటో ఉంది. కాబట్టి రేప్ జరిగిందనడం అబద్ధం.

Also Read :

దిశ నిందితుడి ఇంట్లో తీవ్ర విషాదం..

ఇలాగే చిగురుటాకులా వణికిపోతున్న ఒక చిన్నారిని హెల్మెట్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్న ఒక పోలీసు లాఠీతో బెదిరిస్తున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ వాస్తవం ఏమటంటే అది 2010 లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో వస్త్రపరిశ్రమ ఉద్యోగుల సమ్మెకు సంబంధించిన ఫోటో. ఆ ఫోటోను చూపించి, ఢిల్లీలో పోలీసులు ఒక మత వర్గానికి చెందిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్న ఫేక్ న్యూస్ ను ప్రచారం చేయడం జరుగుతోంది. గతంలో బిజెపిలో పనిచేసి, ఇప్పుడు బిజెపి వ్యతిరేకిగా మారిన మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ వంటి వారు సైతం ఈ ఫోటోను షేర్ చేశారు.

పోలీసులపై ఫేక్ పోస్టులు

ఇంకొక పోస్టులో పోలీసులే స్వయంగా అల్లరి మూకలకు సాయం చేసి, మత కల్లోలాలలో నీచమైన పాత్ర పోషించిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్పొరేటర్ తాహిర్ హుస్సేన్ ఇంట్లోకి వారిని పైపు ద్వారా పైకి పంపిస్తున్నట్టు ఫోటోలు సర్కులేట్ అవుతున్నాయి. కానీ వాస్తవం ఏమిటంటే అల్లర్లలో చిక్కుబడిపోయి ప్రజలను పై నుంచి కిందకు దిగుతుంటే వారు పడకుండా పోలీసులు పట్టుకుంటున్న దృశ్యానికి సంబంధించిన ఫోటోలు అవి. వాటికి తాహిర్ హుస్సేన్ ఇంటికి సంబంధం లేదు. అదే విధంగా తాహిర్ హుస్సేన్ ఇంట్లో డాబా మీద రాళ్లను వర్షించేందుకు అల్లరి మూకలు ఫిట్ చేసిన గులేరి వాస్తవానికి పోలీసులే అమర్చారని కూడా ఫేక్ పోస్టులు ప్రచారం చేస్తున్నాయి. ఈ అబద్ధాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత గోపాల్ రాయ్ సైతం వెరిఫై చేసుకోకుండా షేర్ చేశారు. తాహిర్ హుస్సేన్ ఇంట్లో యాసిడ్ పౌచ్ లు, పెట్రోల్ బాంబులు, రాళ్లు పోలీసులే పెట్టారని కూడా ప్రచారం జరుగుతోంది. కానీ వీటిలో వాస్తవం లేదని ఫ్యాక్ట్ చెక్ చెబుతోంది.

ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఢిల్లీ అల్లర్లలో పోలీసుల కణతకు తుపాకీ గురిపెట్టిన దుండగుడు మహ్మద్ షారుఖ్ వాస్తవానికి ముస్లిం కాదని, అతని అసలు పేరు అనురాగ్ మిశ్ర అని కూడా సోషల్ మీడియాలో ఒక వర్గం ప్రచారం చేస్తోంది. సుప్రసిద్ధ జర్నలిస్టు, మేగసేసే అవార్డు విన్నర్ రవీశ్ కుమార్ సైతం ఈ అబద్ధాన్ని ప్రచారం చేయడం విశేషం. ఇప్పటికే మహ్మద్ షారుఖ్ అరెస్టయి పోలీసుల అధీనంలో ఉన్నాడు.

మొత్తం మీద సోషల్ మీడియా వేదికగా ఢిల్లీ అల్లర్లపై పలు అబద్ధాలు ప్రచారమౌతున్నాయి. వీటిని గుర్తించి, నిజాలు చెప్పి, దోషులపై కేసులు పెట్టేసరికి పోలీసుల తల ప్రాణం తోకకు వస్తోంది.

Next Story