అందరినీ భయపెడుతున్న కరోనా ఎఫెక్ట్ ఇప్పుడు తెలుగు రాష్ర్టాలను తాకింది. హైదరాబాద్ లో కరోనా సోకిన వ్యక్తి ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండగా..మరో ఇద్దరు అనుమానితుల్ని కూడా అక్కడే ఉంచారు. 45 మందికి కరోనా నెగిటివ్ అని తేలగా..ఇద్దరి రిపోర్టుల పై మాత్రం సందిగ్ధత నెలకొంది. దీంతో వైద్యులు వారి శాంపిల్స్ ను పుణెలోని వైరాలజీ ల్యాబ్ క పంపారు. ఈ రిపోర్టులు గురువారం వచ్చే అవకాశం ఉంది. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిలో ఒకరు ఇటీవలే ఇటలీ నుంచి స్వదేశానికి వచ్చినట్లు సమాచారం. కాగా..బుధవారం ఇటలీ నుంచి వచ్చిన 21 మందిలో 15 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో..వారిని స్పెషల్ క్యాంప్ కు తరలించి అక్కడే చికిత్స అందిస్తున్నారు. కరోనా నెగిటివ్ అని తేలిన 45 మంది 14 రోజుల వరకూ ఎక్కడికీ వెళ్లరాదని..ఇళ్లకే పరిమితమవ్వాల్సిందిగా వైద్యులు సూచించారు.

అయితే..కొన్ని తినడం వల్ల, తాగడం వల్ల కరోనా రాకుండా ఉంటుందని, కరోనాకు మందు దొరికిందని కొన్ని అవాస్తవాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వెల్లుల్లి తినడం వల్ల కరోనా తగ్గుతుందని చాలా మంది అపోహ పడుతున్నారు. కానీ..నిజానికి ఇందులో ఇసుమంతైనా నిజం లేదు. అలాగే కరోనా సోకిన ప్రతి ఒక్కరికి ప్రాణాపాయం ఉండదు. 100 మందిలో ఇద్దరికి మాత్రమే..రెండు శాతం మాత్రమే ప్రమాదకర పరిస్థితులుంటాయి. కరోనాకు వ్యాక్సిన్ ఉందని, ఫ్లూ వ్యాక్సిన్ తో కరోనా నయమవుతుందని అనుకుంటున్నారు..కానీ..ఫ్లూ వ్యాక్సిన్ కరోనాకు పనిచేయదు. మౌత్ మాస్క్ వేసుకోవడం ద్వారా కరోనా రాదనుకోవడం కూడా అపనమ్మకమే. నిజానికి కరోనా సోకిన పేషెంట్లు ఇతరులకు అది వెళ్లకుండా మాస్క్ వేసుకోవచ్చు. అంతేగాని..పూర్తిగా వైరస్ సోకకుండా మాస్క్ కాపాడుతుందని చెప్పలేం. కేవలం వయసు పైబడిన వారికే కాదు..అన్ని వయసుల వారికీ కరోనా సోకే అవకాశముంది. అలాగే మనం డైలీ వాడే యాంటిబయోటిక్స్ వాడటంతో కరోనా పోతుందని ప్రచారం జరుగుతుంది..అదే నిజమైతే..చైనాలోనే దానిని నిర్మూలించేవారు కదా..పెంపుడు జంతువుల వల్ల కరోనా సోకినట్లు ఇంత వరకూ ఖచ్చితమైన ఆధారాలేమీ లేవు. కాబట్టి ఎవరూ కంగారు పడకండి.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.