FactCheck: బంగ్లాదేశ్‌కు సంబంధించిన వీడియోను తక్కువకులానికి చెందిన వ్యక్తికి జరిగిన అవమానంగా షేర్ చేస్తున్నారు
Bangladesh Bodybuilder’s Video Shared As Indian On Social Media. “టాలెంట్ ఎంత ఉన్నా కులాన్ని బట్టే గుర్తింపు ఉంటుంది డిజిటల్ ఇండియా లో"
By Nellutla Kavitha Published on 4 Jan 2023 12:30 PM GMT"టాలెంట్ ఎంత ఉన్నా కులాన్ని బట్టే గుర్తింపు ఉంటుంది డిజిటల్ ఇండియా లో" అంటూ తక్కువ కులం వాడు అయినందున అతనిలో ఉన్న ప్రతిభను గుర్తించకుండా అవమానించారని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అవుతోంది.
ఇక ఇదే వీడియోని మరొక నెటిజన్ "అతనికి వచ్చిన కోపానికి గిఫ్ట్ ని ఎగరేసి తన్నాడు కానీ అవమానించినోడి ఫేస్ మీద విసర్లేదు" అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
వైరల్ అవుతున్న వీడియోల కోసం ఇక్కడ అండ్ ఇక్కడ క్లిక్ చేయండి.
నిజనిర్ధారణ
సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అయిన ఈ వీడియోలో నిజం ఎంత?! ఫ్యాక్ట్ చెక్ చేసి చూసింది న్యూ మీటర్ టీం. ఇందుకోసం కీవర్డ్ సెర్చ్ తో పాటుగా కీ ఫ్రేమ్ అనాలసిస్ చేసి చూసింది న్యూస్ మీటర్. దీంతో ఇది బంగ్లాదేశ్ నేషనల్ బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్ 2022 సందర్భంగా చోటు చేసుకున్న సంఘటన గా తేలింది. వైరల్ వీడియోలో బహుమతిని కాలితో తన్నుతున్న వ్యక్తి బాడీ బిల్డర్ జాహిద్ హసన్ షువో. దీనిని బంగ్లాదేశ్ కు చెందిన స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానల్ SPORTS WORLD, Dec 26, 2022 రోజున పోస్ట్ చేసింది.
https://www.youtube.com/shorts/mfQBr78C8P4
ఇక ఈ సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలోనూ జాహిద్ హసన్ కు అనుకూలంగా పోస్టులు కనిపించాయి. గతంలోనే నేషనల్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్ అయిన తనకు ఈసారి అవమానం జరిగిందని, మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని, బంగ్లాదేశ్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ లో అక్రమాలు చోటు చేసుకోవడం వల్లే తనకు రెండవ స్థానం వచ్చిందన్న కోపంతో జాహిద్ హసన్ అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
https://twitter.com/gharkekalesh/status/1609431602173739008
డిసెంబర్ 23, 2022 రోజున బంగ్లాదేశ్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నేషనల్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్ 2022 కాంపిటీషన్ జరిగింది. దీనిని జాహిద్ హసన్ తన ఫేస్ బుక్ లో లైవ్ గా చూపించారు.
https://www.facebook.com/watch/live/?ref=watch_permalink&v=8537105449694474
అవార్డు బహుకరణ సమయంలో జాహిద్ హసన్ కు రెండవ స్థానం వచ్చినట్లుగా నిర్వాహకులు ప్రకటించారు. మెడల్, ట్రోఫీతో పాటు బహుమతిగా వచ్చిన బ్లెండర్ ని కూడా తీసుకున్న తర్వాత మాట్లాడాలని అనుకుంటే నిర్వాహకులు అనుమతి ఇవ్వలేదని దీంతో అసహనానికి గురైన జాహిద్ హసన్ బహుమతిగా వచ్చిన బ్లెండర్ ని కాలితో తన్నాడని ద బ్రిడ్జ్ అనే పత్రిక వివరించింది.
బహుమతుల ప్రధానోత్సవం సందర్భంగా జాహిద్ హసన్ అనుచిత ప్రవర్తనకు శిక్షగా బాంగ్లాదేశ్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్, బాడీ బిల్డింగ్ నుండి జీవిత కాలం పాటు తనపై నిషేధం విధించింది.
ఈ సంఘటన తరువాత కూడా జాహిద్ హసన్ ఫేస్ బుక్ లైవ్ ద్వారా తన నిరసనను వ్యక్తం చేశారు.
https://www.facebook.com/watch/live/?ref=watch_permalink&v=868423357822144
సో, బంగ్లాదేశ్ బాడీ బిల్డర్ జాహిద్ హసన్ తన బహుమతి ని కాలితో తన్నిన దృశ్యాలను భారతదేశంలో తక్కువ కులానికి చెందిన వ్యక్తికి జరిగినట్టుగా షేర్ చేస్తున్నారు.