Fact Check: నిజమెంత: ఆవిరి పీల్చడం ద్వారా కోవిద్-19 ను తరిమేయొచ్చు అని చెబుతూ ఆడియో వైరల్..?

By సుభాష్  Published on  23 July 2020 3:23 AM GMT
Fact Check: నిజమెంత: ఆవిరి పీల్చడం ద్వారా కోవిద్-19 ను తరిమేయొచ్చు అని చెబుతూ ఆడియో వైరల్..?

ముంబైకి చెందిన ఓ డాక్టర్ ఆవిరిని పీల్చడం ద్వారా కోవిద్-19ను తరిమేయొచ్చు అని చెబుతున్న ఆడియో ఫైల్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా వాట్సప్ లో ఈ ఆడియో ఫైల్ ను వైరల్ చేస్తూ ఉన్నారు. ఆవిరి పట్టడం ద్వారా ముక్కుల్లో ఉన్న కరోనా వైరస్ ను చంపేయొచ్చని చెబుతూ ఉన్నారు. పారా-నాసల్ ట్రీట్మెంట్ ఇదని ఆడియోలో చెబుతూ ఉన్నారు.

ఈ ఆడియో మరాఠీ భాషలో ఉంది. తాను డాక్టర్ ను అని చెబుతున్న ఆ డాక్టర్ ఈ ట్రీట్మెంట్ కు కావాల్సిన మెషీన్లు ముంబై లోని చాలా ఆసుపత్రులకు, పోలీస్ స్టేషన్లకు ఇచ్చాను అని చెప్పుకొచ్చాడు. ఈ వైరల్ మెసేజ్ ను వెరిఫై చేయాలంటూ న్యూస్ మీటర్ ను రిక్వెస్ట్ చేశారు.

Fff

నిజ నిర్ధారణ:

ఆవిరిని పీల్చడం ద్వారా కరోనాను చంపేయొచ్చు అంటూ ఇప్పటికే చాలా మంది సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. చైనీయులు కూడా కరోనాతో పోరాడడానికి ఆవిరి పట్టడం మొదలుపెట్టారని పలువురు చెబుతూ వచ్చారు. అలాంటి పోస్టులపై నిజా నిజాలు తెలుసుకోవాలని న్యూస్ మీటర్ హైదరాబాద్ కు చెందిన సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సిసిఎంబి) డైరెక్టర్ రాకేష్ మిశ్రాను సంప్రదించగా ఆయన మాట్లాడుతూ 'ఆవిరి పట్టడం వలన దగ్గు, జలుబు నుండి తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభిస్తుంది. కొన్ని లక్షణాలు మాత్రమే తగ్గుతాయి. అంతేకానీ కరోనా వైరస్ ను అంతం చేసే శక్తి లేదు' అని స్పష్టం చేశారు.

కరోనా వైరస్ ను అంతం చేయడానికి ఆవిరి పీల్చడం కూడా ఉపయోగపడుతుందనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని తెలిపారు. ఆవిరి పీల్చడం ద్వారా వైరస్ ఊపిరితిత్తుల దాకా వెళ్లకుండా ఆపవచ్చని.. అంతేకానీ పూర్తిగా చంపేసే అవకాశం లేదని అన్నారు. ఎక్కువగా ఆవిరి పట్టడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. అదే పనిగా ఆవిరి పట్టడం వలన చాలా అనర్థాలు చోటుచేసుకునే అవకాశం ఉందని.. ఈ సలహాను పాటించడం తప్పని అన్నారు.

Boom Live సంస్థ ఈ ఘటనపై ఫ్యాక్ట్ చెక్ చేసింది.. ఆ వ్యక్తి తాను పోలీసులకు ఆవిరి పీల్చే పరికరాలు ఇచ్చానని చెప్పాడు. ముంబై లోని శాంటాక్రూజ్ పోలీసు స్టేషన్ లోని అధికారులకు కరోనా సోకకముందు ఈ ఆవిరి యంత్రాలను ఇచ్చాడు. ఓ పోలీసు ఆఫీసర్ కూడా తమకు ఈ ఆవిరి యంత్రాలు ఇచ్చారని చెప్పుకొచ్చారు.. కానీ జూన్ నెలలో సబ్-ఇన్స్పెక్టర్ కోవిద్-19 కారణంగా మరణించినట్లు తెలుస్తోంది.

కూపర్ ఆసుపత్రిని సంప్రదించగా.. ఆసుపత్రి సిబ్బంది నుండి ఎటువంటి రెస్పాన్స్ లభించలేదు. ఈ ఆడియోలో మాట్లాడిన వ్యక్తికి సంబంధించిన సమాచారం లభించలేదు.

ఆవిరి పీల్చడం ద్వారా కోవిద్-19 ను తరిమేయొచ్చు అని చెబుతున్న ఆడియోలో ఎటువంటి నిజం లేదు.

Next Story