మనుషులు చేతులు కడుక్కోవడం చూసి ఒరాంగుటన్ కూడా చేతులు కడుక్కుందా.. నిజమెంత..?

By సుభాష్  Published on  3 April 2020 7:32 AM GMT
మనుషులు చేతులు కడుక్కోవడం చూసి ఒరాంగుటన్ కూడా చేతులు కడుక్కుందా.. నిజమెంత..?

కరోనా వైరస్ ప్రబలుతున్న సమయంలో తగు జాగ్రత్తలను సూచిస్తున్నారు వైద్యులు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు చేతులను సోప్ లేదా హ్యాండ్ వాష్ తో కడగాలి అని సూచిస్తున్నారు . కరోనా వైరస్ ను అరికట్టాలంటే ఎప్పటికప్పుడు చేతులు కడగడమే మన ముందున్న ఆయుధం అంటున్నారు.

ఇప్పుడు ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో ఓ ఒరాంగుటన్ తన చేతులను శుభ్రంగా కడుక్కుంటూ ఉంది. జూలో ఉన్నటువంటి శాండ్రా అనే ఒరాంగుటన్ జూలో పనిచేసే వాళ్ళు తరచూ చేతులు కడగడం చూసిందని.. అందుకే అది కూడా వాళ్ళను ఫాలో అయ్యిందని చెబుతున్నారు.

ఆ వైరల్ వీడియో “Sandra, the Orangutan started washing her hands because she saw all Zoo keepers doing it.”(శాండ్రా అనే ఒరాంగుటన్ చేతులు కడుక్కోవడం మొదలుపెట్టింది.. జూకీపర్లు చేతులు కడుక్కోవడం చూసిన శాండ్రా ఇలా చేయడం మొదలుపెట్టింది) అనే క్యాప్షన్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ట్విట్టర్ లోనే కాదు ఫేస్ బుక్ లో కూడా వైరల్ అవుతోంది ఈ వీడియో:నిజమెంత:

జూలో పని చేస్తున్న వారిని చూసి ఒరాంగుటన్ చేతులు కడుక్కోవడం నేర్చుకుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నదంతా పచ్చి అబద్దం.. ఇందులో ఏ మాత్రం నిజం లేదు.

వైరల్ అవుతున్న వీడియో లోని కీ ఫ్రేమ్ లను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సర్చ్ చేయగా.. ఈ వీడియో మొదటి సారి నవంబర్ 3, 2019న పబ్లిష్ చేశారు. కరోనా వైరస్ అన్నది ప్రబలడానికి ముందే ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు.

ఈ వీడియోను Centre for Great Apes (CGA) సంస్థ తమ ఫేస్ బుక్ వీడియోలో అప్లోడ్ చేసింది. “Sandra has daily pools of water and really likes to wash things — her toys, her surroundings, and her hands! Sandra loves to clean up! #orangutancaringweek #cleanhands #bubblesarebest. (sic)” (శాండ్రాకు ప్రతిరోజూ నీటిలో ఆడుకోవడం ఇష్టమని.. తన బొమ్మలను, చేతులను, చుట్టుపక్కల ఉన్న వాటిని కడుగుతూ ఉండడం ఇష్టం) అని వాళ్ళు పెట్టిన పోస్టుకి అర్థం.

Centre for Great Apes (CGA) సంస్థ ఒరాంగుటన్ ల బాగోగులు చూసుకుంటూ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నుండి రిటైర్ అయిన వాటిని చాలా జాగ్రత్తగా పరిరక్షిస్తూ ఉంటారు. CGA వెబ్సైట్ లో ఉన్న సమాచారం ప్రకారం శాండ్రా ఫిబ్రవరి 14, 1986న జర్మనీ లోని రోస్టోక్ జూలాజిషెర్ గార్టెన్ లో పుట్టింది. అర్జెంటినా లోని బ్రూనోస్ ఎయిర్స్ జూలో 2016 వరకూ నివసించింది శాండ్రా. 2016 లో ఆ జూను మూసివేశారు. అర్జెంటీనాలో ఒరాంగుటాన్ లకు చెందిన అభయారణ్యాలు ఏవీ లేకపోవడంతో అక్కడి నుండి అమెరికాకు సెప్టెంబర్, 2019లో శాండ్రాను తీసుకుని వచ్చారు.

Fact Check1

నవంబర్, 2019 లో తమ దగ్గరకు శాండ్రా వచ్చిందని.. ఇతర ఒరాంగుటన్ లతో కలిసి ఉండడానికి దోహదపడుతుందని వెబ్సైట్ లో రాశారు. జీవించినంత కాలం అక్కడే ఉంటుందని తెలిపారు.Centre for Great Apes మరోసారి శాండ్రాకు చెందిన వీడియోను మార్చి 15న విడుదల చేసింది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ గైడ్ లైన్స్ ప్రకారం శాండ్రా 20 సెకెండ్ల కంటే ఎక్కువ సేపే చేతులు కడుక్కుందని వారు తెలిపారు.

కోవిద్-19 ప్రబలుతున్న సమయంలో జూకీపర్లు తరచూ చేతులు కడగడం చూసి శాండ్రా కూడా చేతులు కడుక్కుంది అన్నది అబద్ధమే..! కానీ శాండ్రా అలా కడుక్కోవడం మాత్రం ఎంతో మందికి ఆదర్శం.

Next Story
Share it