2019లో వెల్లువెత్తిన తప్పుడు వార్తలు
By రాణి Published on 4 Jan 2020 12:14 PM GMT
మూకదాడులు, విధ్వంసాలకు దారితీసిన పరిణామాలు
గడిచిన 2019వ సంవత్సరంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నకిలీ, తప్పుడు వార్తల పోస్టింగులు, షేరింగులు వెల్లువెత్తాయి. కేంద్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా గత యేడాది తప్పుడు వార్తలు అరికట్టేందుకు తీసుకున్న చర్యలకు తోడు.. వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కూడా స్వీయ-నియంత్రణ చర్యలు తీసుకున్నప్పటికీ నకిలీ వార్తల ప్రచారం తగ్గుముఖం పట్టలేదు.
తప్పుడు వార్తల పర్యవసానంతో విపరిణామాలకు దారితీసిన సంఘటనల్లో తాజాగా చెప్పుకోదగ్గది CAA. అసలు CAA అంటే ఏంటో తెలియకుండానే అనేక పుకార్లు షికార్లు చేశాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా నిరసనలు, అల్లర్లకు కారణమయ్యాయి.
సార్వత్రిక ఎన్నికలు.. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, పుల్వామా దాడి, ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వంటి కీలక పరిణామాలు గత యేడాది దేశ ప్రజలను, వివిధ వర్గాలను అటువైపు సీరియస్‌గా దృష్టిపెట్టేలా చేశాయి. ఇదే తరుణంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పుంఖాను పుంఖాలుగా తప్పుడు సమాచారం, అబద్ధపు సమాచారం వైరల్ అయ్యింది. తప్పుడు వార్తలు విస్తృతంగా షికార్లు చేశాయి. హిందీ, ఇంగ్లీష్ మాత్రమే కాదు.. భారతీయ భాషలన్నింటిలోనూ తప్పుడు వార్తల షికార్లు తలనొప్పులు తెచ్చిపెట్టాయి. ఫలితంగా 2019వ సంవత్సరం నకిలీ వార్తలు, తప్పుడు సమాచారం వ్యాప్తి భారీగా నమోదయ్యింది.
ఫ్యాక్ట్ చెకింగ్ టీమ్‌లు నిరంతరం ఒక ఇష్యూ నుంచి మరొక ఇష్యూకు మారి తప్పుడు వార్తల నిర్ధారణ చేయాల్సిన అవసరం 2019వ సంవత్సరంలో ఏర్పడింది. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల తరువాత తప్పుడు, అబద్ధపు సమాచారం వ్యాప్తి కనుమరుగవుతుందని, అంత అవసరం ఏమీ ఉండదని, ఇక ఈ అంశంపై సీరియస్‌గా దృష్టిపెట్టాల్సిన అవసరం లేదని భావించారు. కానీ.. ఆ తర్వాత ఒక్కొక్కటిగా వెలువడ్డ నిర్ణయాలు, పరిణామాలు ఫ్యాక్ట్ చెకర్లను ఉరుకులు పరుగులు పెట్టించాయి. వాటిలో పుల్వామా దాడులు, ఆర్టికల్ 370 రద్దు, CAA చట్టం వంటి కీలక అంశాలున్నాయి.
గతేడాది మిస్ ఇన్ఫర్‌మేషన్, డిస్ ఇన్ఫర్‌మేషన్ తీవ్రత 20 శాతం నుంచి 50 శాతం దాకా పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో.. ఫ్యాక్ట్‌చెకర్ల కొరత కూడా ఏర్పడినట్లు భావిస్తున్నారు. ఈ యేడాది ఫ్యాక్ట్ చెకింగ్ నెట్‌వర్క్ మరింత పెరగాల్సిన అనివార్య పరిస్థితి తలెత్తిందంటున్నారు ఫ్యాక్ట్ చెకింగ్ నిపుణులు. సమకాలీన పరిణామాలకు అనుగుణంగా అవేర్‌నెస్ వర్క్‌షాప్‌లు తరచుగా, విస్తృతంగా నిర్వహించాలని, ఫ్యాక్ట్ చెకర్ల పరిధిని, విస్తృతిని పెంచాలన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
చెక్ ఫర్ స్పామ్
సోషల్ మీడియాలో పోస్ట్‌లను ధృవీకరించే 'చెక్ ఫర్ స్పామ్' అనే నాన్‌ప్రాఫిటబుల్ సంస్థ గడిచిన యేడాదికంటే 2019లో ఫ్యాక్ట్‌చెక్ నిర్ధారించాల్సిన మెస్సేజ్‌ల సంఖ్య 20శాతం పెరిగింది. అంతకుముందు నెలకు 4వేల దాకా పోస్టులను విశ్లేషించిన ఈ సంస్థ.. 2019లో మాత్రం నెలకు 5వేల నుంచి, 6వేల దాకా పోస్టులను ఫ్యాక్ట్‌చెకింగ్ కోసం విశ్లేషించాల్సి వచ్చింది. వాటిలో జాతీయ స్థాయిలో చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించిన అంశాలే అధికంగా ఉన్నాయి. ప్రధానంగా ఎన్నికల సమయంలో నకిలీ వార్తల పోస్టింగులు ఎక్కువగా ఉంటాయి. వాట్సప్ మొత్తం అలాంటి సమాచారంతో నిండిపోతుంది. అయితే.. 2019లో మాత్రం యేడాది పొడవునా ఇలాంటి సమాచారం వెల్లువెత్తింది.
ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, షేర్‌చాట్, టిక్‌టాక్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ప్రపంచంలోనే అత్యధికమంది సోషల్ మీడియా వినియోగదారులు భారతదేశంలో ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా వ్యాపించిన నకిలీ కథలు, పుకార్లు, ద్వేషపూరిత ప్రసంగాలు దేశంలో మూకదాడులు, విధ్వంసాలకు కూడా దారితీశాయి. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ సోషల్ మీడియాలో వైరల్ వార్తల నియంత్రణకు తీసుకున్న చర్యలతో.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కూడా పోస్టులపై ఆంక్షలను ప్రవేశపెట్టాయి. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడంలో భాగస్వాములైన చాలా మంది వినియోగదారుల ఖాతాలను బ్లాక్ చేశాయి. అయినప్పటికీ, ఈ తరహా ప్రచారం భారీగా కొనసాగింది. 2020 యేడాదినీ సవాల్ చేస్తోంది.
- సుజాత గోపగోని