రాజధానుల ఏర్పాటుపై తెలుగు తమ్ముళ్లలో భిన్న స్వరాలు
By రాణి Published on 18 Dec 2019 2:08 PM ISTవిశాఖపట్నం : ఏపీకి మూడు రాజధానులు అవసరమంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటనపై టీడీపీలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తాజాగా జగన్ ప్రకటనపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ ద్వారా స్పందించారు. "విశాఖపట్నం ని పరిపాలనా రాజధాని గా మార్చే అవకాశం ఉందంటూ ముఖ్యమంత్రి శాసనసభ లో చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం. సహజ సిద్ధమైన సముద్ర తీర నగరం విశాఖ ను పరిపాలనా రాజధాని చేయడం మంచి నిర్ణయం. రోడ్, రైల్, ఎయిర్, వాటర్ కనెక్టివిటీ తో రాజధాని గా అందరి ఆశలు, ఆంక్షలని నెరవేర్చే నగరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాస్మో మెట్రో నగరం పరిపాలనా కేంద్రం గా కూడా మారితే విశ్వనగరంగా ప్రసిద్ధి చెందడం ఖాయం. అందుకు విశాఖ ప్రజలు తమ సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు." అని గంటా ట్వీట్ చేశారు.
అయితే గంటా శ్రీనివాసరావు వైసీపీకి అనుకూలంగా మాట్లాడటంపై తెలుగు తమ్ముళ్లలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటి ఈ ట్వీట్ పై చాలా మంది పలురకాలుగా స్పందిస్తున్నారు. "వైఎస్సార్సీపీ లో చేరక ముందే పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. మీరెప్పుడు పార్టీలో చేరుతున్నారు. జగన్ లా మీరు కూడా తుగ్లక్ లాగా మారిపోయారు." "ఆయన ప్రకటన చేస్తే మీరు మురిసి పోతున్నారు. సరిగ్గా ఉద్యోగులకు జీతాలివ్వడం కూడా చేతకావడం లేదు గానీ మూడు రాజధానులు నిర్మిస్తాడట", " మన స్వార్థం కోసం రాష్ర్ట భవిష్యత్ ను తాకట్టు పెడుతున్నట్లుంది. ఉదాహరణకు పిల్లలు పుట్టాక మీ నాన్న ఎవరంటే ఒకరిని చూపిస్తారా, ముగ్గురిని చూపిస్తారా" ఇలా అనేక రకాలుగా గంటా శ్రీనివాసరావు చేసిన ట్వీట్ కు టీడీపీ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు.