హైదరాబాద్ : ఈఎస్‌ఐ స్కాంలోని నిందితులను ఏసీబీ కోర్టు కస్టడీకి అనుమతించింది. మొదట అరెస్టైన దేవికారాణితోపాటు మరో ఆరుగురిని కూడా కస్టడీకి అనుమతించింది కోర్ట్. 9, 10 తేదీల్లో ఈ ఆరుగురు ఏసీబీ కస్టడీలో ఉంటారు. ఇప్పటికే ఈఎస్‌ఐ స్కాం నిందితులు చంచల్‌ గూడ జైల్లో ఉన్నారు. 9న వీరిని చంచల్‌గూడ జైల్ నుంచి కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈఎస్‌ఐ స్కాంలో ఈ రోజు సుధాకర్‌ రెడ్డి అనే మరో వ్యక్తిని కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. లైఫ్ కేర్‌ డ్రగ్స్ ఎండీ సుధాకర్‌ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ స్కాంలో మరి కొంతమందిని అరెస్ట్ చేసే అవకాశముందని తెలుస్తోంది.

ఈఎస్ఐ స్కాంలో  కోట్ల రూపాయలు  పక్కదారి పట్టినట్లు ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. అందులో భాగంగా పక్కా ప్లాన్ తో ఏసీబీ అధికారులు వారం రోజుల  నుంచి అనుమానం ఉన్న   ప్రతిచోట సోదాలు చేస్తున్నారు. ఈ కేసులో మొదట ఈఎస్ఐ డైరక్టర్ దేవికారాణినే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మొదట నుంచి ఆమె చుట్టే ఈఎస్ఐ కథ నడిచిందని అధికారులు గుర్తించారు. అంతేకాదు..ఆమె  పై అధికారుల ఆదేశాలను కూడా లెక్క చేయకుండా  మొండిగా  ముందుకు పోవడాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంది.

ఇప్పటికే  ఈ స్కాంలో చాలా ఫార్మా కంపెనీలు, మెడికల్ షాపులకు చెందిన వారు ఉన్నట్లు  ఏసీబీ అధికారులు చెబుతున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆధారాలు పక్కాగా ఏసీబీ దగ్గర ఉన్నాయంటున్నారు. అందుకే..ఆరుగురిని కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.