ఈఎస్‌ఐ స్కామ్‌ : ప‌్రైవేట్ ఆస్ప‌త్రుల గుట్టుర‌ట్టు

By Medi Samrat
Published on : 11 Oct 2019 1:53 PM IST

ఈఎస్‌ఐ స్కామ్‌ : ప‌్రైవేట్ ఆస్ప‌త్రుల గుట్టుర‌ట్టు

హైదరాబాద్: ఈఎస్‌ఐ మెడికల్ స్కామ్‌లో ప్రైవేట్ ఆస్పత్రుల పాత్ర బయటపడుతోంది. పలు ప్రైవేట్ ఆస్పత్రులతో కలిసి ఈఎస్‌ఐ సిబ్బంది ఈ దందాకు పాల్పడినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. పటాన్‌చెరు. చెర్లపల్లి, వనస్థలిపురం, ఆర్‌సీ పురంలో డిస్పెన్సరీ మందుల విక్రయాలు జరిగినట్లు ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. రెండు రోజులగా దేవికారాణిని ఏసీబీ అధికారులు విచారించడంతో ప్రైవేట్ ఆస్పత్రుల బండారం బయటపడింది.

ఓమ్మి ఫార్మాతో పాటుగా ఇద్దరు జాయింట్ డైరెక్టర్లు పద్మ, వసంత, ఫార్మాసిస్టు రాధికలు ప్రైవేట్ ఆస్పత్రులకు మందులు తరలించినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. కొనుగోలు చేసిన మెడిసిన్ప్‌ను డిస్పెన్సరీలకు పంపించి అక్కడి నుంచి కార్మికులకు ఇచ్చినట్లుగా చూపెట్టినట్టు ఏసీబీ విచారణలో తెలిసింది. ఈఎస్‌ఐ మందులను దొడ్డి దారిన ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించినట్లు ఏసీబీ గుర్తించింది.

ప్రతి డిస్పెన్పరి పరిధిలోని నాలుగు పెద్ద ఆస్పత్రులకు ఈఎస్‌ఐ మందులను సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. అక్రమంగా ఈఎస్‌ఐ మందులు కొనుగొలు చేసిన ప్రైవేట్‌ ఆస్పత్రులపైన కేసులు నమోదు చేయాలని ఏసీబీ భావిస్తోంది. కాగా ఇప్పటికే ఈఎస్‌ఐ మందులను కొనుగొలు చేసిన ప్రైవేట్‌ ఆస్సత్రుల జాబితాను ఏసీబీ సిద్ధం చేసినట్లుగా సమాచారం.

మరో ముగ్గురు అరెస్ట్‌

ఇదిలాఉంటే.. ఈఎస్‌ఐ స్కామ్‌లో నేడు మరో ముగ్గురిని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. తేజ ఫార్మా ఎండీ రాజేశ్వర్‌ రెడ్డి, చర్లపల్లి ఫార్మాసిస్ట్‌ లావణ్య, వరంగల్‌ జేడీ కార్యాలయంలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి పాషాలను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు మందులు తరలించారన్న నేపథ్యంలో వీరిని అరెస్ట్‌ చేశారు. పెద్ద మొత్తంలో ఈఎస్‌ఐ మందులను ప్రైవేట్‌ ఆస్పత్రులకు సిబ్బంది తరలించినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు.

Next Story