డబ్బులిచ్చి మరీ నెగెటివ్ ప్రచారం చేయిస్తున్నారు: విజయ్ దేవరకొండ
ఖుషీ సినిమాపై సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారంటూ విజయ్ దేవరకొండ సంచలన కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 5 Sept 2023 12:17 PM ISTడబ్బులిచ్చి మరీ నెగెటివ్ ప్రచారం చేయిస్తున్నారు: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన సినిమా 'ఖుషీ'. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శివనిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. అయితే.. ఖుషీ సినిమా మంచి టాక్‌నే సంపాదించుకుంది. అంతేకాదు.. వసూళ్లను కూడా బాగానే రాబడుతోంది. విజయ్ దేవరకొండకు లైగర్ వంటి ఫ్లాప్ తర్వాత మంచి హిట్‌గా నిలిచింది. ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.70 కోట్లను రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. దాంతో.. ఖుషీ మూవీ టీమ్ ఎంతో సంతోషంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఖుషీ టీమ్ సక్సెస్ మీట్‌ను విశాఖలో ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు చేశారు.
తనపై, ఖుషీ సినిమాపై సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారంటూ విజయ్ దేవరకొండ సంచలన కామెంట్స్ చేశారు. కొందరు అయితే డబ్బులు ఇచ్చి మరీ సినిమాపై నెగిటివిటీ ప్రచారం చేశారని అన్నారు. సినిమా బాలేదంటూ ఎన్నో ఫేక్ రేటింగ్స్ ప్రచారం చేశారని అన్నారు. యూట్యూబ్‌లో వచ్చిన ఫేక్ రివ్యూలను దాటుకుని ఖుషీ సినిమా విజయవంతంగా ప్రదర్శితం అవుతోందని విజయ్ దేవరకొండ అన్నారు. సినిమాను హిట్‌గా నిలిపిన అభిమానులు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. అభిమానులు ఇచ్చిన ప్రేమను, ఎనర్జీని చూస్తుంటే ఫేక్ రివ్యూల గురించి నిరుత్సాహపడకూడదని అనిపిస్తోందని అన్నారు. అయితే.. అలాంటి వారి సంగతి మరోరోజు చూసుకుందామని విజయ్ అన్నారు. కొంతకాలం తర్వాత హిట్ దొరికినందుకు తనకూ సంతోషంగా ఉందని చెప్పారు విజయ్.
డబ్బు సంపాదించాలి, అమ్మా, నాన్నలను బాగా చూసుకోవాలి, సమాజంలో గౌరవంగా బతకాలనే ఎప్పుడూ ఆలోచిస్తానని అన్నారు విజయ్ దేవరకొండ. అవి దృష్టిలో ఉంచుకునే ఎప్పుడూ పని చేసుంటానని అన్నారు. ఇప్పుడు కొన్నింటిని మార్చుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అభిమానుల కోసం పనిచేయాలని అనుకుంటున్నట్లు విజయ్ దేవరకొండ అన్నాడు. వంద కుటుంబాలను ఎంపిక చేసి తన సంపాదన నుంచి రూ. కోటి (ఒక్కో ఫ్యామిలీకి రూ.లక్ష) పదిరోజుల్లో అందిస్తానని చెప్పారు. ఇక నుంచి అందరం దేవర ఫ్యామిలీనే అని చెప్పారు రౌడీ హీరో. తన ఆనందంలో అభిమానులు ఉన్నారనీ.. అలాంటప్పుడు తన సంపాదనలో కొంత భాగాన్ని పంచుకుంటానని చెప్పారు. త్వరలోనే అభిమానుల కోసం మరిన్ని కార్యక్రమాలను చేపడతానని విజయ్ దేవరకొండ తెలిపారు.