సంక్రాంతి బరిలోకి వెంకీ, 'గుంటూరు కారం'కు పోటీగా 'సైంధవ్'

జనవరిలో సైంధవ్‌ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. జనవరి 13న రిలీజ్‌ చేస్తున్నట్లు పోస్టర్‌ను విడుదల చేశారు.

By Srikanth Gundamalla  Published on  5 Oct 2023 1:47 PM IST
Venkatesh, saindhav Movie, release date,  pongal,

సంక్రాంతి బరిలోకి వెంకీ, 'గుంటూరు కారం'కు పోటీగా 'సైంధవ్'

ఊహించని విధంగా డిసెంబర్ 22ని సలార్ తీసేసుకుంది. దాంతో.. ఆ డేట్ కి ముందు ప్లాన్ చేసుకున్న సినిమాలు వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. ఆ సినిమాల్లో వెంకటేశ్ 'సైంధవ్‌' కూడా ఉంది. హిట్‌ సిరీస్‌ దర్శకుడు సైలేష్‌ కొలనుతో వెంకీమామ తన 75వ సినిమాగా సైంధవ్‌లో నటిస్తున్నాడు. సరికొత్త యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. అయితే.. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. సంక్రాంతి బరిలో దిగుతున్నట్లు స్వయంగా వెంకటేశ్‌ తన ఎక్స్‌ (ట్విట్టర్‌) అకౌంట్‌ ద్వారా వెల్లడించారు.

ఇటీవలె శ్రీలంక షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ జరుపుకుంటుంది. సైంధవ్‌ సినిమా ముందుగా క్రిస్మస్‌ వీక్‌ను లాక్‌ చేసుకోగా.. సలార్‌ పోటీగా రావడంతో మేకర్స్‌ రిలీజ్‌ తేదీని మార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే జనవరిలో సైంధవ్‌ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 13న రిలీజ్‌ చేస్తున్నట్లు పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే.. సంక్రాంతి కావడంతో వెంకీ మామ సినిమాకు పోటీ తప్పడం లేదు. ఈ సినిమాకు ముందు రోజే మహేశ్‌బాబు గుంటూరుకారం మూవీ రిలీజ్ కాబోతుంది. త్రివిక్రమ్‌-మహేశ్‌ కాంబోలో వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు.. ప్రశాంత్‌ వర్మ హనుమాన్‌ సినిమా కూడా సంక్రాంతికే వస్తోంది. ఈ రెండు సినిమాల పోటీని తట్టుకుని వెంకీమామ సైంధవ్ నిలుస్తుందా చూడాలి. అయితే.. ఈ సినిమా ఊహించిన రేంజ్‌లో ఉండబోతుందని ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది. కంటెంట్‌ మీదున్న నమ్మకంతోనే ఈ సినిమాను సంక్రాంతికి బరిలోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

సస్పెన్స్ థ్రిల్లర్‌ కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంట్లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నాయని తెలుస్తోంది. సైంధవ్‌లో బ్లాక్‌ మేజిక్‌ కీలక పాత్ర పోషించనుందని సమాచారం. హిట్‌ సిరీస్‌తో థ్రిల్లర్‌ సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట అని పేరు పొందిన సైలేష్‌.. ఈ సినిమాతో మరోసారి తానేంటో నిరూపించుకోబోతున్నాడు. ఈ సినిమాకు సంతోష్‌ నారాయణ్ సంగీతం అందిస్తుండగా.. నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ నిర్మిస్తోంది.

Next Story