విషాదం.. ప్రముఖ సంగీత విద్వాంసుడు కన్నుమూత

భారత సంగీత ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత విద్వాంసుడు ధృపదాచార్య పండిట్‌ లక్ష్మణ్ భట్‌ (93) కన్నుమూశారు.

By Srikanth Gundamalla  Published on  11 Feb 2024 11:02 AM GMT
Tragedy, musician pandit laxman bhatt , passed away,

విషాదం.. ప్రముఖ సంగీత విద్వాంసుడు కన్నుమూత 

భారత సంగీత ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత విద్వాంసుడు ధృపదాచార్య పండిట్‌ లక్ష్మణ్ భట్‌ (93) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. న్యుమోనియాతో పాటు వయోవృద్ధాప్య సమస్యలతో లక్ష్మణ్ భట్‌ బాధపడుతున్నారు. ఆయన్ని చికిత్స కోసం జైపూర్‌లోని దుర్లబ్జీ ఆస్పత్రిలో ఉంచారు కుటుంబ సభ్యులు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తన తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించామని ప్రొఫెసర్ మధు భట్‌ తైలాంగ్ చెప్పారు. చికిత్స సమయంలోనే ఆస్పత్రిలో తుది శ్వాస విడిచినట్లు చెప్పారు. ఇక ఈ వార్తతో సంగీత కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.

కాగా.. ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాలకు ధృపదాచార్య పండిట్ లక్ష్మణ్‌ భట్‌ తైలాంగ్‌ ఎంపిక అయ్యారు. ఈ అవార్డును మరికొద్ది రోజుల్లోనే అందుకోవాల్సి ఉంది. అలాంటి సమయంలోనే చనిపోవడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ధృపదాచార్య పండిట్‌ లక్ష్మణ్‌ భట్‌ తైలాంగ్‌ తన జీవితం మొత్తాన్ని సంగీతానికే అర్పించారు. పండిట్ లక్ష్మణ్ భట్‌ తైలాంగ్ బనస్థలి విద్యాపీఠ్, రాజస్థాన్‌ సంగీత సంస్థలో సంగీత ఉపన్యాసకుడిగా కూడా పనిచేశారు. 1985లో జైపూర్‌లో రసమంజరి పేరుతో ఒక సంగీతోపాసన కేంద్రాన్ని లక్ష్మణ్ భట్ తైలాంగ్ ప్రారంభించారు. అక్కడ ఎంతో మందికి ఉచితంగా విద్యనందించారు. జైపూర్‌లో అంతర్జాతీయ ధ్రుపద్-ధామ్ ట్రస్ట్‌ను స్థాపించారు. దాని ద్వారా పేదలకు సహాయ సహకారాలు అందించారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మక్ష అవార్డును ప్రకటించింది.

Next Story