థియేటర్లో క్రాకర్స్ పేల్చి రచ్చరచ్చ చేసిన సల్మాన్ ఫ్యాన్స్ (వీడియో)

అభిమాన హీరో సినిమా విడుదలైతే చాలు.. ఫ్యాన్స్‌ చేసే సందడి మామూలుగా ఉండదు.

By Srikanth Gundamalla  Published on  13 Nov 2023 3:56 PM IST
tiger-3 movie, salman khan, fans , fire crackers,  theatre,

థియేటర్లో క్రాకర్స్ పేల్చి రచ్చరచ్చ చేసిన సల్మాన్ ఫ్యాన్స్ (వీడియో)

సినిమా హీరోలకు అభిమానులు ఉంటారు. అభిమాన హీరో సినిమా విడుదలైతే చాలు.. ఫ్యాన్స్‌ చేసే సందడి మామూలుగా ఉండదు. వారు చేసే పనుల వల్ల కొన్నిసార్లు గర్వంగా ఫీలైతే.. ఇంకొన్ని సమయాల్లో హీరోలు ఇబ్బందులు పడుతుంటారు. అయితే.. తాజాగా బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఫ్యాన్స్‌ కూడా అలాగే ప్రవర్తించారు. వారి తీరుపై సోషల్‌ మీడియాలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు సల్మాన్‌ ఖాన్‌ కూడా స్పందించారు.

దీపావళి సందర్భంగా సల్మాన్‌ ఖాన్‌ టైగర్-3 సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. దాంతో.. సల్మాన్‌ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వారి వేడుకలు ఇతరులకు ఇబ్బంది కలిగించనంత వరకు ఉంటే ఏం కాదు.. కానీ తాజాగా సల్మాన్‌ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఏకంగా వారు సినీ ప్రేక్షకుల ప్రాణాల మీదకు తెచ్చారు. ఆదివారం మాలేగావ్‌ థియేటర్‌లో టైగర్‌-3 సినిమా ప్రదర్శితం అవుతున్న సమయంలో ఫ్యాన్స్‌ నానా రచ్చ చేశారు.

కొందరు వ్యక్తులు థియేటర్లోకి ఎలా తీసుకెళ్లారో తెలియదు కానీ భారీ ఎత్తున టపాసులను తీసుకెళ్లారు. సినిమా ప్రదర్శితం అవుతుండగానే టపాసులకు నిప్పటించారు. అంతే ఇక.. భారీ ఎత్తున పటాకులు పేలడం మొదలయ్యాయి. కొన్ని రాకెట్లు.. చిచ్చుబుడ్లు ఎగిసిపడ్డాయి. తోక పటాకులు పేలి థియేటర్లో ఉన్న ఇతర ప్రేక్షకులపైనా ఎగిరిపడ్డాయి. దాంతో.. థియేటర్లో ఉన్నవారంతా భయాందోళనకు గురయ్యారు. లోయర్ క్లాస్‌లో కూర్చున్నవారు ప్రాణభయంతో థియేటర్‌లో నుంచి బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు సదురు అభిమానుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది నేరమని.. ఈ చర్యకు పాల్పడ్డ వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరోవైపు ఈ వీడియో వైరల్ కావడంతో ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా హీరో సల్మాన్‌ ఖాన్ స్పందించారు. " టైగర్ 3 సినిమా ప్రదర్శితం అవుతోన్న థియేటర్లో బాణసంచా కాల్చడం గురించి నేను వింటున్నాను. ఇది ప్రమాదకరం. మనల్ని, ఇతరులను రిస్క్‌లో పెట్టకుండా సినిమాను ఎంజాయ్ చేద్దాం. సురక్షితంగా ఉండండి". అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

Next Story