తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా దిల్ రాజు ఎన్నిక
తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు.
By Srikanth Gundamalla Published on 31 July 2023 3:07 AM GMTతెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా దిల్ రాజు ఎన్నిక
తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. విజయవంతంగా ముగిసిన ఈ ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు. ప్రత్యర్థి నిర్మాత సి. కల్యాణ్‌పై 17 ఓట్ల తేడాతో గెలుపొందారు. వైస్ ప్రెసిడెంట్‌గా ముత్యాల రామదాసు, కార్యదర్శిగా దామోదర్ ప్రసాద్, ట్రెజరర్‌గా ప్రసన్న కుమార్ ఎంపికయ్యారు. మొత్తం 48 ఓట్లలో దిల్ రాజుకి 31 ఓట్లు పోల్ అయ్యాయి. దాంతో.. ఆయన ప్రెసిడెంట్‌గా ఎన్నిక అయ్యారు.
ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ ఎన్నికల్లో 2023-25 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 1,339 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల్లో అగ్ర నిర్మాత దిల్‌రాజు, మరో నిర్మాత సి.కల్యాణ్ ప్యానల్స్ మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. 14 రౌండ్స్‌లో 891 ఓట్లు పోల్ కాగా 563 ఓట్లు దిల్ రాజుకు, సి.కల్యాణ్‌కు 497 ఓట్లు పోల్ అయ్యాయి. 12 మందిలో దిల్‌రాజు ప్యానల్ నుంచి ఏడుగురు ఎన్నికయ్యారు. స్టూడియో సెక్టార్ నుంచి గెలిచిన నలుగురిలో ముగ్గురు దిల్‌రాజు ప్యానల్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో ఇరు ప్యానల్స్‌లో చెరో ఆరుగురు గెలిచారు. ఈ ఎన్నికల్లో చిన్న సినిమాల మనుగడ, డిజిటల్ సర్వీసు ప్రొవైడర్ల ఛార్జిల తగ్గింపు హామీతో సి.కల్యాణ్ ప్యానెల్, ఫిల్మ్ ఛాంబర్ మనుగడ, భవిష్యత్ తరాలకు మంచి సినీ పరిశ్రమను అందించాలనే నినాదంతో దిల్‌రాజు ప్యానెల్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.
ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, స్టూడియోల యజమానులు సహా సుమారు 2 వేలకు పైగా టీఎఫ్‌సీసీలో సభ్యులుగా ఉన్నారు. హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో ఎన్నికలు జరిగాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్ జరగ్గా.. ఆ తర్వాత వెంటనే ఓట్ల లెక్కింపు జరిగింది. తొలుత ఈవీఎంలు మొరాయించాయి. కాసేపు కౌంటింగ్ నిలిచినా వెంటనే సమస్యను పరిష్కరించడంతో లెక్కింపు సజావుగా సాగింది. విజయవంతంగా ఎన్నికలు ముగిశాయి.