మానవోత్తమ రాముడు - శ్రీమాన్ రామా ఆనిమేటెడ్ సిరీస్

Sriman Rama Animated Series On Rama.ఈతరం పిల్లలకు సూపర్ హీరోలంటే సూపర్ మాన్, స్పైడర్ మాన్, మార్వెల్

By Nellutla Kavitha  Published on  10 April 2022 2:44 AM GMT
మానవోత్తమ రాముడు - శ్రీమాన్ రామా ఆనిమేటెడ్ సిరీస్

ఈతరం పిల్లలకు సూపర్ హీరోలంటే సూపర్ మాన్, స్పైడర్ మాన్, మార్వెల్ సిరీస్ మాత్రమే గుర్తుకొస్తాయి. సినిమాల్లో వారు చేసే యాక్షన్ సీన్లను చూసి వారే రియల్ లైఫ్ యాక్షన్ హీరోలు, సూపర్ హీరోలు అని భావిస్తున్నారు పిల్లలంతా. అయితే ఈ విశ్వంలోనే మొట్టమొదటి సూపర్ హీరో మన వాడేనని, విశ్వమంతటికి మేటి విలుకాడు కూడా అతడేనని ఒక యానిమేటెడ్ సిరీస్ రూపంలో పిల్లలకి పరిచయం చేయబోతున్నారు. మనం తిరుగుతున్న నేలమీదే సామాన్య మానవుడి లాగా నడిచి, సకల గుణాలతో, మర్యాద పురుషోత్తముడిలాగా పేరు తెచ్చుకున్న రాముణ్ణి శ్రీమాన్ రామ పేరుతో పిల్లల కోసం ఒక యానిమేటెడ్ సిరీస్ గా రూపొందించారు భార్గవ కొడవంటి.


సకల విద్యా పారంగతుడు, షోడశ కళల నిపుణుడు, మర్యాదా పురుషోత్తముడు, ఆదర్శపురుషుడిగా శ్రీరామచంద్రునికి పేరుంది. శ్రీమద్రామాయణ ఇతిహాసంలోని ప్రతిఘట్టం శ్రీరాముడిని అదేవిధంగా అభివర్ణిస్తుంది. రామో విగ్రహవాన్ ధర్మః అంటూ రాక్షసుడైన మారీచుడు రావణాసురుడికి స్వయంగా రాముడు గురించి వర్ణించి చెప్పాడు. ఇక ఉత్తమ మానవుడికి ఉండాల్సిన గుణాలను శ్రీరాముడు తన జీవితంలో ఆచరించి చూపాడని, అందుకే శ్రీరాముడు మానవోత్తమ రాముడు అయ్యాడు. శ్రీరాముడికి అనంతమైన సుగుణాలున్నాయి. అయినప్పటికీ, ముఖ్యంగా 16 గొప్ప గుణాలను వాల్మీకి మహర్షి రామాయణం లో చెప్పారు. ఆ పదహారు గుణాల్లో కనీసం ఒక్క గుణాన్నైనా వ్యక్తులుగా మనం ఆచరించాలని, అందుకు బీజం చిన్నతనంలోనే పడాలని భావించారు భార్గవ.

స్వయంగా చిత్ర నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న భార్గవ కొడవంటి, పిల్లల కోసం ఒక యానిమేటెడ్ సిరీస్ ని రూపొందించారు. శ్రీమాన్ రామ పేరుతో ఉన్న ఈ యానిమేటెడ్ సిరీస్ లో మూడువేల ఎపిసోడ్లు ఉండబోతున్నాయి. ఇవన్నీ శ్రీరాముడి బాల లీలలకు సంబంధించినవే. వశిష్ట మహాముని గురుకులంలో రాముడు తన సోదరులతో పాటుగా, ఇతర విద్యార్థులతో కలిసి నేర్చుకున్న విద్య, వాటితో పాటుగా చూపించిన వీరగాధలు, రాముడి 16 సుగుణాల గురించి ఇందులో వివరంగా చూపిస్తారు. ప్రతి మనిషిలోనూ రాముడి రూపంలో మంచి ఉంటుందని, రావణాసుడు రూపంలో చెడు ఉంటుందని, అయితే ఏ దిశలో వెళ్ళాలి అనే జ్ఞానాన్ని చిన్నతనంలోనే కలిగిస్తే పెద్దయ్యాక సంపూర్ణ వ్యక్తిత్వం ఉన్న వారిగా మారుతారని అంటున్నారు భార్గవ. అందుకే చిన్న పిల్లల కోసమే రాముడ్ని సూపర్ హీరోగా పరిచయం చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంటుందని, వారి కోసమే శ్రీమాన్ రామ పేరుతో యానిమేటెడ్ సిరీస్ ను తీసుకొస్తున్నట్లుగా చెప్పారు భార్గవ.


గుణవంతుడు, శక్తిమంతుడు, ధర్మజ్ఞుడు, విద్వాంసుడు, సమర్థవంతుడు, ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు…ఇలా ఏ ఒక్క మంచి వ్యక్తిత్వం అయినా అలవడుతుందని, ప్రతి ఇంట్లోనూ రాముడిని తయారు చేయాల్సిన అవసరముందన్నారాయన. అదే లక్ష్యంతో శ్రీమాన్ రామను రూపొందించానని భార్గవ చెబుతున్నారు. సత్యకాశి అనే కలం పేరుతో 2006లోనే తొలి తెలుగు యానిమేషన్ చిత్రం కిట్టును నిర్మించి, జాతీయ స్థాయిలో స్వర్ణకమలం పురస్కారాన్ని అందుకున్నారు భార్గవ. ఇక భవిష్యత్తులో పిల్లల కోసమే OTT ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. పిల్లల కోసమే, పిల్లలకు అవసరమైన సరైన వేదిక లేదని, ఆ దిశగా జరగాల్సిన, రావాల్సిన మార్పుపై దృష్టి పెట్టాలన్నారు భార్గవ.


ఫిక్షన్ క్యారెక్టర్లే అయిన సూపర్ హీరోల గురించి కాకుండా, మన నేల మీద నడయాడిన సూపర్ హీరోల గురించి మన పిల్లలకు చెప్పుకోవాల్సిన అవసరం, బాధ్యత ఉందని అంటున్నారు భార్గవ. అందుకే ఆ దిశగానే OTT ప్రారంభించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాను అంటున్నారు. ఇప్పటికే శ్రీమాన్ రామ కి సంబంధించి ట్రైలర్ తో పాటుగా సాంగ్ ను కూడా రిలీజ్ చేసిన భార్గవ, వచ్చే వినాయక చవితికి మొదటి సిరీస్ విడుదల చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. మూడు వేల ఎపిసోడ్స్ అన్నీ రాముడి బాల లీలలే ఉంటాయని, అవన్నీ చిన్నారులకు ఉపయోగకరంగా, భవిష్యత్తుకు బాటలు వేసేలా ఉంటాయని అంటున్నారు భార్గవ.


Next Story