హేమ కమిటీ నివేదికను స్వాగతించిన సమంత.. టాలీవుడ్‌లో కూడా..
మలయాళ చిత్రపరిశ్రమలో హేమ కమిటీ అద్భుతంగా పనిచేస్తోంది.
By Srikanth Gundamalla Published on 31 Aug 2024 3:45 AM GMTమలయాళ చిత్రపరిశ్రమలో హేమ కమిటీ అద్భుతంగా పనిచేస్తోంది. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికి తీసుకొస్తుంది. ఈ మేరకు నివేదికను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ పనితీరున అందరూ ప్రశంసిస్తున్నారు. తాజాగా హీరోయిన్ సమంత కూడా అభినందించారు. కమిటీ ఏర్పాటుకు కారణమైన డబ్ల్యూసీసీ సంస్థను కూడా ఆమె పొగిడారు. సంస్థ సభ్యుల కష్టం వల్లే ఈ రోజు మహిళల సమస్యలు వెలుగులోకి వచ్చి చర్చనీయాంశం అయ్యాయని పేర్కొన్నారు. సినీ పరివ్రమలో మహిళల సంరక్షణ కోసం ఆ సంస్థ పోరాటం గొప్పగా ఉందని సమంత చెప్పారు. డబ్ల్యూసీసీ గురించి తనకు చాలా కాలంగా తెలుసు అనీ.. ప్రభుత్వం హేమ కమిటీ ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ తీసుకున్న చొరవే కారణమని అన్నారు. వారి పోరాటానికి సమంత కృతజ్ఞతలు తెలిపారు.
అన్ని సినీ ఇండస్ట్రీలలో ఇప్పుడు హేమ కమిటీ గురించే మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా చేసిన పోస్ట్ మాత్రం వైరల్ అవుతోంది. టాలీవుడ్ మహిళల తరపున ఆమె హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నట్లుగా పేర్కొంటూ.. తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఓ విన్నపాన్ని విన్నవించుకున్నారు. ఈ మేరకు పోస్టులో ఇలా రాసుకొచ్చారు సమంత. 'తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళలమైన మేము హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం. దీనికి మార్గం వేసిన కేరళ డబ్ల్యూసీసీ నిరంతర ప్రయత్నాలను అభినందిస్తున్నాం. తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళల కోసం 2019లో సృష్టించబడిన సపోర్ట్ గ్రూప్ అయిన ది వాయిస్ ఆఫ్ ఉమెన్ కూడా ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ గ్రూప్ స్ఫూర్తిగా తీసుకోవాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని నెలకొల్పడానికి రూపొందించిన సబ్ కమిటీ నివేదికను ప్రచురించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం' అని సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో సమస్యలపై పోరాటానికి సిద్ధమైందంటూ.. తొలి అడుగు వేసిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.