'కేజీఎఫ్-2'-'సలార్‌' సినిమాలకు లింక్‌?.. ప్రశాంత్‌నీల్‌ మాస్టర్‌మైండ్

'సలార్‌' సినిమాకు, 'కేజీఎఫ్‌-2' సినిమాకు ప్రశాంత్‌ నీల్‌ ఏదో లింక్‌ పెట్టారని అర్థమవుతోంది.

By Srikanth Gundamalla  Published on  4 July 2023 12:17 PM IST
Salaar, KGF-2, Movie Link, Prabhas, Prashanth neel,

'కేజీఎఫ్-2'-'సలార్‌' సినిమాలకు లింక్‌?.. ప్రశాంత్‌నీల్‌ మాస్టర్‌మైండ్

యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ప్రశాంత్‌నీల్‌ 'సలార్‌' సినిమా తీస్తున్నారు. రాధేశ్యామ్, తర్వాత ఆదిపురుష్‌ పెద్ద హిట్‌గా నిలుస్తుందనుకుంటే ప్రభాస్‌కు నిరాశే ఎదురైందని చెప్పాలి. తీవ్రవిమర్శలకు గురై అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. దీంతో.. ప్రశాంత్‌నీల్‌ తో తీస్తోన్న 'సలార్‌'పైనే ప్రభాస్‌ ఆశలు పెట్టుకున్నారు. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. సలార్‌ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా శృతిహాసన్‌ నటిస్తోంది. హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. కేజీఎఫ్, కేజీఎఫ్‌-2 తర్వాత ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ రెండు సినిమాలకు మించిన యాక్షన్‌ సీన్లు సలార్‌లో ఉంటాయంటున్నారు సినీ విశ్లేషకులు. జూలై 6న సలార్‌ సినిమా టీజర్‌ను విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. డైరెక్టర్ ప్రశాంత్‌నీల్ ఇక్కడ ఒక ట్విస్ట్‌ పెట్టారు.

ఈ నెల 6న ఉదయం 5:12 గంటలకు టీజర్‌ విడుదల చేయనున్నట్లు తెలిపారు. సాధారణంగా టీజర్‌, ట్రైలర్లను తెల్లవారుజామున విడుదల చేసిన దాఖలాలు లేవు. ఇందుకు భిన్నంగా సలార్‌ టీజర్‌ విడుదల ఉదయం 5:12 గంటలకు రానుండటం వెనుక డైరెక్టర్‌ ప్రశాంత్‌నీల్‌ మాస్టర్‌ మైండ్‌ ఉందని అంటున్నారు. కేజీఎఫ్‌-2, సలార్‌కు ఏదో లింక్‌ ఉందంటూ అభిప్రాయపడుతున్నారు కేజీఎఫ్‌-2 క్లైమాక్స్‌ అందరూ చూసే ఉంటారు. సినిమా చివరలో హీరో యశ్‌పై సముద్రంలో దాడి జరుగుతోంది. యశ్‌ ప్రయాణిస్తోన్న ఓడలోని గడియారాల్లో టైమ్‌ను చూపించే సీన్‌ కూడా ఉంటుంది. దాంతో 'సలార్‌' సినిమాకు, కేజీఎఫ్‌ సినిమాకు ప్రశాంత్‌ నీల్‌ ఏదో లింక్‌ పెట్టారని అర్థమవుతోంది. అదేంటో అని అందరూ తలలు పీక్కుంటున్నారు. ఇక రెండు చిత్రాలను ముడిపెడుతూ ప్రశాంత్‌నీల్‌ మాస్టర్‌ ప్లాన్‌ వేశాడని ప్రముఖ కాలమిస్ట్‌ మనోబాల విజయబాలన్ ట్వీట్‌ చేశారు. దీంతో ఆసక్తి మరింత పెరిగింది. అసలా లింకేంటి అనేది సలార్‌ సినిమా టీజర్‌ విడుదలయ్యాకే తెలిసే అవకాశం ఉంది. కాగా.. సలార్‌ సినిమా సెప్టెంబర్‌ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Next Story