పెళ్లి జరిగిందన్న వార్తలపై స్పందించిన సాయి పల్లవి

సాయి పల్లవి పెళ్లి జరిగిపోయిందంటూ ఓ ఫొటో వైరల్ అవుతోంది. దీనిపై సాయి పల్లవి స్వయంగా క్లారిటీ ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on  22 Sept 2023 4:28 PM IST
Sai pallavi,  marriage, viral photos, Tweet,

పెళ్లి జరిగిందన్న వార్తలపై స్పందించిన సాయి పల్లవి

హీరోయిన్‌ సాయి పల్లవికి ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ప్రేమమ్‌ చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. ఫిదాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచింది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నటించి తనదైన ముద్రను వేసి గుర్తింపు తెచ్చుకుంది సాయిపల్లవి. అంతేకాదు.. ఈమె డ్యాన్స్‌కి సపరేట్‌ ఫ్యాన్స్‌ ఉంటారు. సెలక్టీవ్‌ క్యారెక్టర్స్‌ చేస్తూ సినిమాల్లో కనిపిస్తోంది సాయి పల్లవి. అయితే.. గతేడాది చివరలో విరాటపర్వం, గార్గి చిత్రాల తర్వాత ఈ అమ్మడు తెలుగు సినిమాలో కనిపించలేదు. దాంతో.. సాయిపల్లవికి సంబంధించి కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. పెళ్లి కోసమే బ్రేక్‌ తీసుకుందంటూ పుకార్లువచ్చాయి. ఇటీవల సోషల్ మీడియాలో కనిపించిన ఓ ఫొటో ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది.

సాయి పల్లవితో పాటు మరో వ్యక్తి పెళ్లి దండలతో ఉన్న ఫొటో సోషల్‌ మీడియాలో కనిపించింది. సాయి పల్లవి నిజంగానే పెళ్లి చేసుకుందనే అనుకున్నారు కొంత మంది. ఇంకొందరు అయితే ఆరా తీయడం ప్రారంభించారు. అసలు విషయం తెలియక అయోమయం అయ్యారు. అయితే.. తాజాగా ఈ వార్తలపై స్వయంగా సాయి పల్లవి స్పందించింది. పెళ్లి వార్తలను కొట్టిపారేస్తూ ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా క్లారిటీ ఇచ్చింది.

తాను పుకార్లు పెద్దగా పట్టించుకోనని రాసుకొచ్చింది సాయి పల్లవి. కానీ అందులో కుటుంబ సభ్యుల్లాంటి స్నేహితులు ఇన్వాల్వ్‌ అయినప్పుడు స్పందించాల్సి వస్తుందని చెప్పింది. కొందరు ఉద్దేశ పూర్వకంగా సినిమా పూజా కార్యక్రమంలోని ఫొటోను క్రాప్‌ చేసి షేర్‌ చేశారని తెలిపింది. తన కొత్త సినిమాల గురించి పంచుకునే సమయంలో ఇలాంటివి నిరుత్సాహపరుస్తాయని సాయి పల్లవి అన్నది. ఇలా కావాలనే ఒకరికి అసౌకర్యం కలిగించేలా పోస్టులు పెట్టడం సరికాదంటూ సాయి పల్లవి సోషల్‌ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. సాయి పల్లవి పోస్టుతో వైరల్‌ అయ్యిన ఆ ఫోటో ఓ సినిమా పూజా కార్యక్రమంలోనిది అని.. క్రాప్‌ చేసి షేర్‌ చేశారని క్లారిటీ వచ్చింది. అయితే.. సాయి పల్లవి స్పందించడానికి ముందే విరాటపర్వం సినిమా దర్శకుడు వేణు ఊడుగుల కూడా ఇది క్రాప్‌ చేసిన ఫొటో అని చెప్పుకొచ్చారు. కానీ.. చర్చ మాత్రం ఆగకపోవడంతో స్వయంగా సాయి పల్లవే పెళ్లి పుకార్లపై స్పందించి.. ఆ వార్తలను కొట్టిపాడేసింది.

సాయి పల్లవి ప్రస్తుతం శివ కార్తికేయన్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతోంది. అంతేకాకుండా నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సాయి పల్లవి కనిపించనుంది.

Next Story