క్షమాపణలు కోరిన హీరో రామ్‌చరణ్‌.. ఎందుకంటే..

జర్మన్‌ యూనిటీ డే సెలబ్రేషన్స్‌కు హాజరుకాలేకపోయినందుకు రామ్‌ చరణ్‌ క్షమాపణలు కోరారు.

By Srikanth Gundamalla  Published on  23 Oct 2023 1:45 PM GMT
ram charan, said sorry,  video call,  germans,

క్షమాపణలు కోరిన హీరో రామ్‌చరణ్‌.. ఎందుకంటే..

ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్‌ను ప్రపంచానికి మరోసారి పరిచయం చేసినట్లు అయ్యింది. అంతేకాదు.. సినిమాలో నటించిన వారు వరల్డ్‌ వైడ్‌ స్టార్లు అయిపోయారు. దర్శకధీరుడు రాజమౌళికి మైల్‌స్టోన్‌గా మిగిలింది ఈ సినిమా. ఇక పాటల విషయానికి వస్తే ఈ సినిమాలో ఉన్న నాటు నాటు పాట ప్రపంచం మొత్తాన్ని డ్యాన్స్‌ చేయించింది. ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డును కూడా గెలుచుకుంది. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ చిత్రబృందం పలు కార్యక్రమాలకు అతిథులుగా హాజరవుతూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా భారత్‌లో జరిగిన జర్మన్ యూనిటీ డే వేడుకల్లోనూ ఈ సినిమా బృందం సందడి చేసింది.

జర్మనీ ఎంబసీ సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మ్యూజిక్‌ డైరెక్టర్ కీరవాణి హాజరు అయ్యారు. ఈ కార్యక్రమానికి హీరో రామ్‌చరణ్‌కు కూడా ఆహ్వానం అందింది. కానీ.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం విహార యాత్రలో ఉన్నాడు. భార్య, కూతురితో కలిసి ఇటలీ వెళ్లాడు. దాంతో.. ఈ వేడుకల్లో భాగం కాలేకపోయాడు చరణ్. ఈ మేరకు రామ్‌ చరణ్‌ జర్మనీ ఎంబసీ సిబ్బందిని వీడియో కాల్‌లో పలకరించారు. ఈ సందర్భంగా జర్మన్‌ యూనిటీ డే సెలబ్రేషన్స్‌కు హాజరుకాలేకపోయినందుకు క్షమాపణలు కోరారు. ఈ మేరకు రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. ఈ వేడుకల్లో ప్రదర్శించిన నాటునాటు సాంగ్‌ కటౌట్‌ తనకెంతో నచ్చిందని వీడియో కాల్‌లో జర్మన్స్‌తో చెప్పారు రామ్‌చరణ్. అయితే.. వీలు చూసుకుని అందరినీ ఓసారి కలుస్తానంటూ హామీ ఇచ్చారు.

కాగా, ఈ వేడుకల్లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తన పాటలతో అలరించారు. నాటు నాటు పాటని జర్మనీలో పాడారు. దీనికి వేడుకలో ఉన్న జర్మనీ ఎంబసీ అధికారులందరూ డ్యాన్స్ కూడా చేశారు. ఈ వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది. కాగా.. రామ్‌చరణ్‌ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఇది విడుదల కానుంది.

Next Story