రామమందిర ప్రారంభోత్సవానికి రామ్‌చరణ్‌కు అందిన ఆహ్వానం
జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది.
By Srikanth Gundamalla Published on 13 Jan 2024 2:30 PM ISTరామమందిర ప్రారంభోత్సవానికి రామ్‌చరణ్‌కు అందిన ఆహ్వానం
జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని అంగరంగ వైభంగా నిర్వహించేందుకు అయోధ్య ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది. దేశం నలు మూలల నుంచి ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. సినీ, రాజకీయా, క్రీడా ప్రముఖులు ఎందరో ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయితే.. తాజాగా టాలీవుడ్ హీరో రామ్‌చరణ్-ఉపాసన దంపతులకు రామమందిర ట్రస్టు ప్రతినిధులు ఆహ్వానం పలికారు. శుక్రవారం ఆయన నివాసంలో కలిసి ప్రత్యేక ఆహ్వానం అందించారు.
ఇప్పటి వరకు సినీ రంగంలో చిరంజీవి, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్ దంపతులు, రాజ్‌కుమార్, హిరానీ, రోహిత్‌శెట్టి, ధనుష్ సహా తదితరులకు ఆహ్వానాలు అందాయి. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా రాముడిప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం భావోద్వేగ పోస్టు పెట్టారు. దేశ ప్రజల తరఫున ప్రతినిధిగా ఉండటం తన అదృష్టమని పేర్కొన్నారు. అంతేకాదు.. 11 రోజుల పాటు ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం రామభక్తులందరికీ ఒక పవిత్రమైనదని చెప్పారు.
రామమందిరం ప్రారంభోత్సానికి 8వేల మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. లక్షకు పైగా భక్తులు ఈ కార్యక్రమానికి హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు. రామాలయం కాంప్లెక్స్‌ను 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడెల్పు, 161 అడుగుల ఎత్తుతో నిర్మించారు. ఆలయంలోని ప్రతి ఫ్లోర్ 20 అడుగుల ఎత్తు ఉంటుంది. 44 ద్వారాలు, 392 పిల్లర్లతో ఆలయం నిర్మితమయింది. ఇక ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.