రామ్‌చరణ్‌ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కన్ఫర్మ్

జాన్వీ కపూర్ తాజాగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది

By Srikanth Gundamalla  Published on  6 March 2024 10:32 AM IST
ram charan, buchi babu,  heroine janhvi kapoor,

రామ్‌చరణ్‌ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కన్ఫర్మ్

దివంగత నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. తొలుత ఆమె కూతురుగానే పేరున్నా.. జాన్వీ తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతోంది. తాజాగా ఆమె టాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టింది. స్టార్‌ హీరోల పక్కన నటిస్తోంది. మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది జాన్వీ. ఉప్పెన సినిమా ఫేమ్‌ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆర్‌సీ 16 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఇది ప్రచారంలో ఉంది. ఈ మూవీలో జాన్వీ నటిస్తున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. జాన్వీ కపూర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రాజెక్టులోకి స్వాగతం అంటూ ఆర్‌సీ 16 మూవీ టీమ్‌ పోస్టు పెట్టింది. కాగా.. జాన్వీ కపూర్‌ తెలుగులో నటిస్తోన్న రెండో సినిమా ఇది.

రామ్‌చరణ్‌ , బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో ఈ సినిమా వస్తోంది. అయితే.. ఆర్‌సీ 16 మూవీకి ఏఆర్ రెహమాన్‌ మ్యూజిక్‌ అందిస్తుండటం విశేషం. కాగా.. మరోవైపు జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ మరో స్టార్ హీరో ఎన్టీఆర్‌ మూవీ 'దేవర'లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్‌ యాక్టర్ సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా కనిపించనున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, టీజర్‌ ఈ మూవీపై హైప్‌ మరింత పెంచాయి. దేవర సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం దేవర పార్ట్‌-1 పేరుతో ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ వంటి అగ్ర హీరోల సినిమాలతో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న జాన్వీకి ఇక్కడ మరిన్ని అవకాశాలు దక్కే చాన్సెస్ ఉన్నాయి.


Next Story