అదే నా జీవితంలో చేసిన పెద్ద తప్పు: రజనీకాంత్

జైలర్ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో పాల్గొన్న సూపర్‌ స్టార్ రజనీకాంత్ వైరల్ కామెంట్స్ చేశారు.

By Srikanth Gundamalla  Published on  30 July 2023 6:41 PM IST
Rajinikanth, Jailer, Movie, Viral Comments,

అదే నా జీవితంలో చేసిన పెద్ద తప్పు: రజనీకాంత్

సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం జైలర్. ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. నెల్సన్ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తమిళ, తెలుగు భాషల్లో ఆగస్టు 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు రజనీకాంత్. ఈ సందర్భంగా రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.

రజనీకాంత్ తన పర్సనల్‌ లైఫ్‌ గురించి చెప్పారు. ఒకప్పుడు తాను మద్యం తాగేవాడినని అన్నారు. మద్యం సేవించడమే తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని చెప్పుకొచ్చారు. మద్యం తాగడం వల్లే ఆరోగ్యం, ఆనందం రెండింటిపై ప్రభావం పడిందని అన్నారు. ఒకవేళ మద్యం తాగకపోయి ఉంటే ఈ రోజు జీవితంలో ఇంతకంటే పెద్ద స్టార్‌గా ఉండేవాడినని అన్నారు. అందుకే మద్యపానానికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని ఈ సందర్భంగా అభిమానులను కోరారు రజనీకాంత్.

ఇక తనకున్న సూపర్‌ స్టార్‌ బిరుదు గురించి కూడా రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సూపర్ స్టార్ బిరుదు తనకు నచ్చదని అన్నారు. అందుకే ఈ సినిమాలోని 'హుకుం' పాటను విడుదల చేసిన సమయంలో తన పేరుకు ముందున్న సూపర్‌ స్టార్‌ తీసేయాలని చిత్ర బృందాన్ని కోరినట్లు రజనీకాంత్ చెప్పారు. గతంలో కూడా కొందరు దర్శకులను ఇదే చెప్పానని.. కాని వారు నిరాకరించినట్లు రజనీకాంత్ చెప్పారు. సూపర్‌ స్టార్ బిరుదు వల్ల ఎప్పుడూ సమస్య ఎదుర్కొంటున్నట్లు చెప్పారు రజనీకాంత్.

జైలర్‌ సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్‌ గురించి మాట్లాడిన రజనీకాంత్.. ఆయన గతంలో తీసిన బీస్ట్‌ సినిమాకు నెగెటివ్‌ టాక్‌ వచ్చినా.. ఎవరూ నష్టపోలేదని చెప్పారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు ఎలాంటి నష్టం రాలేదని స్పష్టం చేశారు. దర్శకుడు తాన నమ్మిన కథ ప్రకారమే సినిమా తీశారని రజనీకాంత్ చెప్పారు. ఇక యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న జైలర్‌ సినిమాను సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. తమన్నా హీరోయిన్‌గా నటించారు. కన్నడ హీరో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, సునీల్‌ జైలర్ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.


Next Story