యూపీ సీఎం కాళ్లకు నమస్కరించడంపై రజనీ ఏమన్నారంటే..

యూపీ సీఎం కాళ్లకు నమస్కరించిన ఘటనపై స్వయంగా రజనీకాంత్‌ వివరణ ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on  22 Aug 2023 7:27 AM GMT
Rajinikanth, Comments,  Yogi, Chennai, airport,

యూపీ సీఎం కాళ్లకు నమస్కరించడంపై రజనీ ఏమన్నారంటే..

సూపర్‌ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నారు. ఆయన నటించిన సినిమా 'జైలర్‌' థియేటర్లలో విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది. బాక్స్‌ఆఫీస్‌ వద్ద రికార్డులను తిరగరాస్తోంది. కలెక్షన్లలో దూసుకుపోతుంది జైలర్‌ సినిమా. చాలా ఏళ్ల తర్వాత రజనీకాంత్‌ సినిమా ఆయన పాత రికార్డ్స్‌నే చెరిపేసి కొత్త రికార్డుల దిశగా సాగుతోంది. ఆయన ట్రెండింగ్‌లో ఉండటానికి ఒక కారణం జైలర్‌ సినిమా అయితే.. మరో కారణం ఇటీవల ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లో చేసిన పర్యటన సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కాళ్లకు నమస్కారం చేయడమే.

అయితే.. హిమలయాల్లో పర్యటించిన తర్వాత సూపర్‌ స్టార్ రజనీకాంత్ యూపీలోనూ పర్యటించారు. ఆ క్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు సూపర్‌ హిట్‌గా నిలిచిన జైలర్ సినిమాను చూపించాలనుకున్నారు. కానీ.. అది కుదరలేదు. ఇతర మంత్రులతో కలిసి రజనీకాంత్ సినిమాను వీక్షించారు. అయితే.. ఆ తర్వాత సీఎంను కలిసేందుకు రజనీకాంత్‌ ఆయన ఇంటికి వెళ్లారు. రజనీకాంత్ రాకతో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్వాగతం పలికేందుకు ఎదురు వచ్చారు. ఆ సందర్భంలోనే రజనీకాంత్‌ యోగి కాళ్లకు ఒంగి నమస్కారం చేశారు. దాంతో.. వెంటనే స్పందించిన యోగి.. రజనీకాంత్‌ను వద్దంటూ ఆపే ప్రయత్నం చేశారు. కానీ.. రజనీకాంత్ అప్పటికే యోగి కాళ్లకు నమస్కారం చేసేశారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు దీన్నంతా వీడియో తీశారు. తాజాగా అదే వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.

రజనీకాంత్‌ కంటే యూపీ సీఎం యోగి వయసులో చిన్నవారు. తనకంటే చిన్నవారి కాళ్లను రజనీకాంత్ ఎలా నమస్కరిస్తారని సోషల్‌ మీడియాలో తెగ చర్చ జరిగింది. కొందరైతే తమిళనాడు ప్రజల మనోభావాలను దెబ్బతీశారంటూ కామెంట్స్.. ట్రోల్స్ చేశారు. దాంతో స్పందించిన రజనీకాంత్‌ అభిమానులు వారికి కౌంటర్‌ ఇచ్చారు. ఆయన సన్యాసులంటే గౌరవిస్తారని.. యూపీ సీఎం కూడా ఒక సన్యాసే అని అందుకే గౌరవంగా ఆయన పాదాలకు నమస్కారం చేశారని చెప్పారు. గతంలోనూ ఇలాగే చేశారని అప్పుడు ప్రశ్నించని వారు... ఇప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటూ నిలదీశారు.

అయితే.. తాజాగా ఈ అంశంపై సూపర్‌ స్టార్ రజనీకాంత్ స్వయంగా స్పందించారు. అన్ని పర్యటనలు ముగించుకున్న తర్వాత ఆయనాగస్టు 21న చెన్నై చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులోనే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రెస్‌ ప్రతినిధులు యోగి కాళ్లకు నమస్కారం చేసిన అంశం వైరల్ అయ్యిందని.. మీరెలా స్పందిస్తారని అడగ్గా ఆయన సమాధానం ఇచ్చారు. ఎవరైనా స్వామీజీ కానీ.. యోగి కానీ తనకు ఎదురుపడితే వాళ్లు తనకంటే చిన్నవారు అయినా సరే కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటానని అన్నారు. అది తాను ఆచరిస్తున్న పద్ధతి అని చెప్పారు రజనీకాంత్. ఇక దీనిపై చర్చ అనవసరం అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. రజనీకాంత్ సంప్రదాయాలకు విలువ ఇచ్చే వ్యక్తి అని అభిమానులు చెబుతున్నారు. స్వయంగా రజనీకాంత్‌ ఈ విమర్శలపై స్పందించడంతో ఈ కాంట్రవర్సీకి ఫుల్‌స్టాప్‌ పడాలని.. ఇకనైనా ఆయన్ని అర్థం చేసుకుని మాట్లాడాలంటూ ఆయన అభిమానులు కోరుతున్నారు.

Next Story