సెలబ్రిటీలకు 'డీప్‌ఫేక్‌' తలనొప్పి.. ప్రియాంక చోప్రా వీడియో వైరల్

డీప్‌ ఫేక్‌ వీడియోలు ఇటీవల కాలంలో ఎక్కువ అయిపోతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  6 Dec 2023 6:50 AM GMT
priyanka chopra, deepfake video, viral ,

సెలబ్రిటీలకు 'డీప్‌ఫేక్‌' తలనొప్పి.. ప్రియాంక చోప్రా వీడియో వైరల్

డీప్‌ ఫేక్‌ వీడియోలు ఇటీవల కాలంలో ఎక్కువ అయిపోతున్నాయి. సెలబ్రిటీల వీడియోలను డీప్‌ ఫేక్‌ చేసి కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఇలాంటి వీడియోల వల్ల వారికి ఇబ్బందులు తప్పడం లేదు. కొంతకాలం ముందు రష్మికు సంబంధించిన వీడియో ఒకటి డీప్‌ఫేక్‌ చేసి అప్‌లోడ్‌ చేయగా అది వైరల్ అయ్యింది. దాంతో.. ఇలాంటివి ఏమాత్రం శ్రేయస్కరం కాదంటూ పలువురు సినీతారలు స్పందించారు. ఇలాంటివాటి పట్ల ప్రతి ఒక్కరూ స్పందించాలని.. ఇవాళ సెలబ్రెటీలకు ఈ పరిస్థితి ఎదురైంది.. రేపు సామాన్యులకూ ఎదురవచ్చు. అప్పుడు పరిస్థితులు మారోలా మారే అవకాశాలు ఉన్నాయంటూ హెచ్చరించారు.

ఇక వేగంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం కూడా తగిన విధంగా చర్యలు చేపడుతోంది. డీప్‌ ఫేక్‌ వీడియోలపై ఫిర్యాదు అందితే వెంటనే చర్యలు తీసుకోవాలని చెబుతోంది. అలాగే కొన్ని రూల్స్‌ కూడా తీసుకొస్తుంది. అయితే.. ఎన్ని రకాలుగా డీప్‌ఫేక్‌ వీడియోలకు చెక్‌ పెట్టేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా.. కొందరు వ్యక్తులు మాత్రం వాటిని సృష్టిస్తూనే ఉన్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రాకు సంబంధించిన వీడియో నెట్టింట దర్శనం ఇచ్చింది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


ప్రియాంక చోప్రా గతంలో మాట్లాడిన ఒక వీడియోలో ఆమె ముఖం మార్చకుండా అందులోని వాయిస్‌ను కొందరు ఆకతాయిలు డీప్‌ఫేక్‌ చేశారు. ఆమె ఒక నకిలీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు లిప్‌సింగ్ కూడా చేశారు. ఆమె తన వార్షిక ఆదాయాన్ని వెల్లడించినట్లు ఆ వీడియోను రూపొందించారు. ఒక బ్రాండ్ కారణంగా 2023లో తన వార్షిక ఆదాయం బాగా పెరిగిందని.. అందరూ దాన్ని వినియోగించుకోవాలి అన్నట్లు ప్రియాంక డీప్‌ఫేక్ వీడియోను క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందించారు. అయితే.. డీప్‌ఫేక్‌ అని గ్రహించిన వారు మాత్రం మిగతావారిని అలర్ట్ చేస్తున్నారు. ఇలాంటి డీప్‌ ఫేక్‌ వీడియోలు ఏమాత్రం సరికాదు అని.. జనాలను మోసం చేసేవిధంగా వీడియోలు క్రియేట్ చేస్తున్నవారిని గుర్తించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story