Raja saab: అరెరె నేను వేరే కథ సినిమా తీస్తున్నానే!: మారుతి

రాజా సాబ్‌ సినిమాపై సోషల్‌ మీడియాలో తెగ చర్చ జరగుతోంది.

By Srikanth Gundamalla  Published on  18 Jan 2024 10:15 AM IST
prabhas, the raja saab, movie, maruthi, tweet,

Raja saab: అరెరె నేను వేరే కథ సినిమా తీస్తున్నానే!: మారుతి

బాహుబలి తర్వాత యంగ్‌ రెబల్ స్టార్‌ ప్రభాస్‌ మంచి హిట్‌ కోసం ఎంతో ప్రయత్నించారు. కానీ ఆయనకు ప్రతిసారి నిరాశే ఎదురైంది. ఇక ఈసారి ఎలాగైనా హిట్‌ పడాల్సిందే అని సెన్సేషనల్ డైరెక్టర్‌ ప్రశాంత్‌నీల్‌తో ప్రభాస్‌ సలార్‌ మూవీ చేశారు. అయితే.. చాలా కాలం తర్వాత ఆయన కెరీర్‌లో హిట్‌ పడింది. మొదట మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్నా.. ఆ తర్వాత కలెక్షన్లతో దూసుకెళ్లింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.611 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇదే జోష్‌లో ప్రభాస్‌ వరుస సినిమాలు చేస్తున్నారు. డైరెక్టర్‌ మారుతితో ప్రభాస్‌ ఇప్పటి వరకు కనిపించని జానర్‌లో నటిస్తున్నారు. అదే కామెడీ హార్రర్‌ థ్రిల్లర్‌ మూవీ. ఈ సినిమాకు టైటిల్‌ను కూడా చిత్రయూనిట్‌ ఖరారు చేసింది. సంక్రాంతి సందర్భంగా ఫస్ట్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ది రాజా సాబ్‌ పేరును ఖరారు చేశారు.

అయితే.. రాజా సాబ్‌ సినిమాపై సోషల్‌ మీడియాలో తెగ చర్చ జరగుతోంది. ఈ సినిమా కథ ఇదేనంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఆఖరికి ఐఎండీబీ కూడా ఈ సినిమా కథను చెప్పేసింది. ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడతారు.. కానీ నెగెటివ్‌ ఎనర్జీ వల్ల ఆ ప్రేమ జంట తమ గమ్యాన్ని మార్చుకుంటారు. ఇదే సినిమా కథ అంటూ క్యాప్షన్స్‌లో రాసుకొచ్చింది. ఇది చూసిన డైరెక్టర్‌ మారుతి ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ వార్తలపై సెటైర్లు వేశారు.

ఎక్స్‌ వేదికగా ఐఎంబీడీ ఫొటోను షేర్‌ చేసిన మారుతి.. అరెరె .. ఈ విషయం నాకు తెలియక వేరే స్క్రిప్ట్‌తో షూటింగ్ చేస్తున్నా అని చెప్పారు. ఇప్పుడు ఐఎంబీడీ సమాజం నన్ను యాక్సెప్ట్‌ చేస్తుందా? అంటూ నవ్వుతూ ఉన్న ఏమోజీని జత చేశాడు డైరెక్టర్ మారుతి. ప్రస్తుతం మారుతి పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్ అభిమానులు.. ఇతర ప్రేక్షకులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ప్రభాస్‌ లుక్‌ని ఎడిట్‌ చేసి ఇవ్వకండి అనీ.. సహజంగా ఉన్న పోస్టర్లే విడుదల చేయాలంటూ మారుతిని కోరుతున్నారు అభిమానులు. హారర్‌ స్క్రిప్ట్‌తో కొత్త జానర్‌లోకి వస్తోన్న ప్రభాస్‌కు మరోసారి మంచి హిట్‌ పడుతుందని దీమా వ్యక్తం చేస్తున్నారు. మారుతి తమని నిరాశపరచరని ఆశిస్తున్నట్లు నెటిజన్లు రాసుకొచ్చారు. కాగా.. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీకి మాళవిక మోహనన్‌ నటిస్తోంది. మారుతితో పాటు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ కల్కి 2898 ఏడీ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీలో కూడా నటిస్తున్నాడు.


Next Story