చెల్లి పెళ్లికి రాని ప్రియాంక చోప్రా.. అసలు కారణం ఇదే

చెల్లి పెళ్లికి ప్రియాంక చోప్రా హాజరుకాకపోవడంపై ఆమె తల్లి మధు చోప్రా స్పందించారు.

By Srikanth Gundamalla  Published on  25 Sept 2023 3:54 PM IST
Parineeti chopra, raghav chadha, Marriage, Priyanka, absence,

చెల్లి పెళ్లికి రాని ప్రియాంక చోప్రా.. అసలు కారణం ఇదే 

బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా వివాహం.. ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దాతో అంగరంగ వైభవంగా జరిగింది. బంధుమిత్రుల మధ్య ఇద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వీరి వివాహానికి చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ఇతరులూ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. పరిణీతి చోప్రా, రాఘవ్‌ చద్దాల వివాహం రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలస్‌లో కన్నుల పండువగా జరిగింది. అయితే.. ఎంతోమంది వచ్చినా పరిణీతి సోదరి, ప్రముఖ బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా వివాహానికి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం దీనిపైనే నెట్టింట చర్చ జరుగుతోంది. పలువురు చెల్లి పెళ్లికి రాకూడదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఇంకొందరైతే ఏకంగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కాగా.. చెల్లి పెళ్లికి ప్రియాంక చోప్రా హాజరుకాకపోవడంపై ఆమె తల్లి మధు చోప్రా స్పందించారు. వివాహ వేడుకకు ప్రియాంక గైర్హాజరుపై క్లారిటీ ఇచ్చారు.

పరిణీతి చోప్రా, రాఘవ్‌ చద్దా వివాహం చాలా బాగా జరిగిందని మధు చోప్రా తెలిపారు. వధూవరులు ఇద్దరూ అందంగా ఉన్నారని అన్నారు. ప్రియాంక చోప్రా వివాహ వేడుకకు గైర్హాజరు కావడంపై స్పందిస్తూ.. సినిమాలకు సంబంధించి గతంలో ఇచ్చిన డేట్స్‌ ఒప్పందం కారణంగా ప్రియాక వివాహానికి రాలేకపోయిందని చెప్పారు. ఇక ఈ వేడుకకు వచ్చిన అతిథులు బహుమతులు తీసుకురాకూడదు అనే నిబంధన పెట్టామని.. కేవలం ఆశీర్వాదం ఇస్తే చాలని చెప్పారు మధు చోప్రా. కాగా.. ఈ వివాహ వేడుకకు తన భర్తతో కలిసి ప్రియాంక చోప్రా వస్తుందని అంతా అనుకున్నారు కానీ.. ఆమె ఇన్‌స్టాలో మాత్రమే నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. దాంతో.. ఆమె పెళ్లికి హాజరుకాకపోవడంపై అందరూ చర్చించుకున్నారు. తాజాగా ఆమె తల్లి మధు చోప్రా క్లారిటీ ఇవ్వడంతో చర్చకు ఫుల్‌స్టాప్‌ పడుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

కాగా.. పెళ్లి తర్వాత పరిణీతి చోప్రా పెట్టిన మొదటి సోషల్‌ మీడియా పోస్టు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కొత్త జీవితం మొదలయ్యాక తన మొదటి పోస్ట్‌ అంటూ షేర్‌ చేస్తూ.. 'ఈరోజు కోసం మేం ఎంతోకాలంగా ఎదురుచూశాం. ఒకరిని విడిచి ఒకరం ఉండలేం. ఎప్పటికీ సాగే మా ప్రయాణం ఇప్పుడే మొదలైంది' అంటూ పరిణీతి చోప్రా రాసుకొచ్చారు. ఈ పోస్టుపై స్పందిస్తున్న సినీ ప్రముఖులు, నెటిజన్లు వారి ఇద్దరికి మరోసారి శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రియాంక కూడా ఈ పోస్ట్‌కు హార్ట్‌ ఎమోజీలు కామెంట్‌ చేసింది.

Next Story