జాతీయ సినిమా అవార్డులు: ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
By Srikanth Gundamalla Published on 24 Aug 2023 6:17 PM ISTజాతీయ సినిమా అవార్డులు: ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
జాతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2021 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. ఈ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. ఇక జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు అందుకోనున్నారు. పుష్ప: ది రైజ్ సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. తెలుగులో మొట్టమొదటి జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డును సొంతం చేసుకుంది స్టైలిష్ స్టార్ అల్లు అర్జునే.
ఇక ఉత్తమ నటి అవార్డును ఈసారి ఇద్దరు పంచుకున్నారు. అలియా భట్ (గంగూభాయి కాఠియావాడి), కృతిసనన్(మిమి)లకు దక్కాయి. సినిమా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నటీనటులు, సాంకేతిక బృందానికి వివిధ కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. 31 విభాగాల్లో ఫీచర్ ఫిల్స్మ్‌కు, 24 విభాగాల్లో నాన్ ఫీచర్ ఫిల్మ్స్‌కు, 3 విభాగాల్లో రచనా విభాగానికి అవార్డులు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా 6 అవార్డులు రాగా, పుష్ప సినిమాకు రెండు వచ్చాయి.
2021 సంవత్సరానికి 281 ఫీచర్ ఫిల్మ్‌లు వివిధ విభాగాల్లో ఈసారి జాతీయ అవార్డుల కోసం స్క్రూటినీకి వచ్చినట్లు జ్యూరీ కమిటీ ప్రకటించింది. ఉత్తమ చిత్ర విమర్శకుడు కేటగిరిలో పురుషోత్తమచార్యులు (తెలుగు)కు అవార్డు దక్కింది. ఉత్తమ హిందీ చిత్రంగా సర్దార్ ఉద్ధమ్, ఉత్తమ గుజరాతీ చిత్రం ‘ఛల్లో’, ఉత్తమ కన్నడ చిత్రంగా ‘777 చార్లీ’, ఉత్తమ మలయాళీ చిత్రంగా ‘హోమ్’ ఎంపికయ్యాయి.
ఉత్తమ తెలుగు చిత్రం - ఉప్పెన, ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప: ది రైజ్), ఉత్తమ కొరియాగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్), ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ - కింగ్ సోలోమన్ (ఆర్ఆర్ఆర్), ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ - కీరవాణి (ఆర్ఆర్ఆర్), ఉత్తమ గీత రచయిత - చంద్రబోస్ (కొండపొలం), ఉత్తమ సంగీత దర్శకుడు - దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప), ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ - శ్రీనివాస్ మోహన్ (ఆర్ఆర్ఆర్), ఉత్తమ ప్రజాదరణ చిత్రం - ఆర్ఆర్ఆర్, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (ఫిమేల్) - శ్రేయా ఘోషల్ (ఆర్ఆర్ఆర్), ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (మేల్) - కాలభైరవ (ఆర్ఆర్ఆర్), జాతీయ సమగ్రతా చిత్రం - ది కశ్మీర్ ఫైల్స్ నిలిచాయి.