పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా? సినిమా ఇండస్ట్రీపై పడతారెందుకు?: చిరంజీవి

చిరంజీవి రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా పరిశ్రమపై పడతారేంటని ప్రశ్నించారు.

By Srikanth Gundamalla  Published on  8 Aug 2023 11:34 AM IST
Megastar Chiranjeevi, Comments, Politics, Waltair Veerayya,

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా? సినిమా ఇండస్ట్రీపై పడతారెందుకు?: చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి వింటేజ్‌ లుక్స్‌.. అండ్‌ యాక్షన్‌ కామెడీతో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' సినిమా పెద్ద హిట్‌గా నిలిచింది. బాబీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో రవితేజ కూడా కీలక పాత్రలో కనిపించారు. సంక్రాంతికి థియేటర్లలో విడుదలై ప్రేక్షలను పూనకాలు ఊగించింది. ఇక ఓటీటీలో మంచి ఆదరణ లభించింది ఈ సినిమాకు. రూ.200 కోట్లు రాబట్టి తాను ఎప్పటికీ మెగాస్టార్‌ అంటూ.. తనకెవరూ సాటిలేరని నిరూపించారు. ఇక తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా 200 డేస్ సెలబ్రేషన్స్‌ జరిగాయి. పలువురు సినీ ప్రముఖుల మధ్య ఓ ప్రయివేట్‌ హోటల్‌లో వేడుకలు నిర్వహించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, రవితేజ పాల్గొని మరోసారి సందడి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు.

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా పరిశ్రమపై పడతారేంటని ప్రశ్నించారు. మీలాంటి వారు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ప్రాజెక్టుల గురించి ఆలోచించాలని సూచించారు. పేదవారి కడుపు నింపే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పారు చిరంజీవి. అలా చేస్తే అందరూ మీకే తలవంచి నమస్కారాలు చేస్తారని అన్నారు. అంతేకానీ.. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినీ పరిశ్రమపై పడతారేంటని మెగాస్టార్ చిరంజీవి చురకలు అంటించారు.

ఇక వాల్తేరు వీరయ్య సినిమా గురించి మాట్లాడిన చిరంజీవి.. ఒకప్పుడు సినిమాలు 100.. 125.. 175.. 200 డేస్‌ ఆడేవి అని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారియపోయారని.. కేవలం రెండు వారాలు లేదా మూడు వారాలు మాత్రమే థియేటర్లలో ఆడుతున్నాయని అన్నారు. కానీ.. అందుకు భిన్నంగా 'వాల్తేరు వీరయ్య' సినిమా 200 రోజులు ప్రదర్శించబడిందని చెప్పారు. దానికి తాను ఎంతో సంతోష పడుతున్నానని తెలిపారు. అత్యధిక రోజులు ప్రదర్శితమై విజయానికి గుర్తుగా షీల్డ్‌లు అందుకుంటున్నందుకు ఒళ్లు పులకరిస్తోందని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు.

Next Story