మరోసారి పేరు మార్చుకున్న మెగా హీరో

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ తన పేరును మార్చుకున్నట్లు తెలిపారు.

By Srikanth Gundamalla  Published on  9 March 2024 7:32 AM IST
mega hero, sai dharam tej,  name change,

మరోసారి పేరు మార్చుకున్న మెగా హీరో 

సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ తాజాగా నటించిన షార్ట్‌ ఫిలిం 'సత్య'. దీని స్పెషల్‌ ప్రీమియర్‌ షోను హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో మీడియాకు ప్రదర్శించారు. నవీన్‌ విజయ్‌ కృష్ణ డైరెక్షన్‌లో ఈ షార్ట్ ఫిలింను రూపొందించారు. అయితే.. ఈ షార్ట్‌ ఫిలింలో సాయి ధరమ్ తేజ్‌, స్వాతిరెడ్డి కలిసి నటించారు. బలగం సినిమా నిర్మాతలు హర్షిత్‌ రెడ్డి, హన్షిత దీన్ని నిర్మించారు. షార్ట్‌ ఫిలిం ప్రీమియర్ షో తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ తన పేరును మార్చుకున్నట్లు తెలిపారు. ఇక నుంచి తన పేరు సాయి ధరమ్ తేజ్‌ కాదనీ.. సాయి దుర్గ తేజ్‌గా మార్చుకున్నట్లు చెప్పారు. తన పేరులో నాన్న ఇంటి పేరు ఎలాగూ ఉంటుందనీ.. పేరులో అమ్మ దుర్గ పేరు ఉండాలనే మార్చుకున్నట్లు సాయి తేజ్ చెప్పాడు. అమ్మ కూడా తనతో, తన పేరులో ఉండాలనే ఉద్దేశంతోనే పేరు సాయి దుర్గ తేజ్‌గా మార్చుకున్నానని మెగా హీరో తెలిపాడు.

ఇక సినిమాల గురించి కూడా పలు విషయాలను పంచుకున్నాడు. తాను ఇప్పటికే నాగబాబు, పవన్‌ కళ్యాణ్‌తో కలిసి నటించానని చెప్పాడు. ఇక తాను చిరంజీవితో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత రామ్‌చరణ్‌ సహా ఇతర మెగా హీరోలతో కూడా కలిసి నటించాలని అనుకుంటున్నట్లు సాయి దుర్గ తేజ్‌ తెలిపాడు. ఈ మెగా హీరో నటిస్తోన్న గంజాయి శంకర్‌ సినిమా పక్కన పెట్టినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని చెప్పారు. కొన్ని వెబ్‌సైట్స్‌ నిజాలు తెలుసుకోకుండా వార్తలు రాస్తున్నాయని పేర్కొన్నారు. గంజాయి శంకర్‌ సినిమా యథావిధిగా కొనసాగుతోందని మెగా హీరో సాయి దుర్గ తేజ్‌ వెల్లడించారు.

Next Story