విషాదం.. బుల్లితెర నటి ఆత్మహత్య
ప్రముఖ మలయాళ బుల్లితెర నటి రెంజూష మీనన్ ఆత్మహత్య చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 30 Oct 2023 3:55 PM ISTవిషాదం.. బుల్లితెర నటి ఆత్మహత్య
సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ బుల్లితెర నటి రెంజూష మీనన్ ఆత్మహత్య చేసుకుంది. తిరువనంతపురంలోని శ్రీకార్యం ప్రాంతంలో ఆమె అపార్ట్‌మెంట్ ఉంది. అందులోనే ఉరి వేసుకుని రెంజూష మీనన్ సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. శవమై పడిఉండటాన్ని గమనించిన ఇంట్లోని పనిచేసే వారు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో.. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే.. ఆమె మృతిపై కేసు నమోదు చేశామని. మరణానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు పోలీసులు.
కాగా.. రెంజూష మీనన్ ఆత్మహత్య గురించి తెలుసుకున్న మలయాళ సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. రెంజూష మృతిపట్ల సంతాపం తెలుపుతున్నారు. కొచ్చికి చెందిన రెంజూషా ఒక మొదట యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. రెంజూష మీనన్ మలయాళ సీరియల్ 'స్త్రీ'తో నటిగా కెరియర్ ప్రారంభించారు. 'నిజలాట్టం,' 'మగలుడే అమ్మ,' బాలామణి' లాంటి ధారావాహికల్లో కనిపించింది. ఆ తర్వాత ఆమె అనేక చిత్రాల్లో కూడా కీలక పాత్రలు చేసింది. 'సిటీ ఆఫ్ గాడ్' మరియు 'మెరిక్కుండోరు కుంజడు' అనే సినిమాల్లో కూడా నటించింది రెంజూష. తన భర్తతో కలిసే రెంజూష తిరువనంతపురంలోని తన అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది. రెంజూష చివరిసారిగా 'ఆనందరాగం' అనే టీవీ షోలో లీడ్ రోల్ పాత్ర పోషించింది.
మరణానికి ముందే ఇన్‌స్టాలో వీడియో షేర్
రెంజూష చనిపోవడానికి ముందే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో రీల్స్ చేస్తూ చాలా ఉత్సాహంగా కనిపించింది. కానీ..ఆ రీల్ అప్‌లోడ్ చేసిన కొద్ది గంటలకే ఆమె ప్రాణాలు కోల్పోయిందన్న విషయం తెలిసింది. సంతోషంగా కనిపించిన వీడియో చూసిన కొద్ది గంటల్లోనే ఆమె మరణవార్త విన్న అభిమానులు షాక్ అయ్యారు. కొందరు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా.. రెంజూష ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని సమాచారం అందుతోంది. అందుకే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని ప్రాథమికంగా పలువురు అభిప్రాయం తెలుపుతున్నారు.