మెగాస్టార్ 'భోళా శంకర్' సినిమా విడుదలకు లైన్ క్లియర్

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంకర్' సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది.

By Srikanth Gundamalla  Published on  10 Aug 2023 9:30 PM IST
Line Clear,  Bhola shankar, Movie , chiranjeevi,

 మెగాస్టార్ 'భోళా శంకర్' సినిమా విడుదలకు లైన్ క్లియర్

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంకర్' సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. గాయత్రి ఫిలిమ్స్‌ పిటిషన్‌ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు డిస్మిస్ చేసింది. దాంతో.. ఈ సినిమా యథావిధిగా శుక్రవారం విడుదల కానుంది. ఇప్పటిదాకా ఈ పిటిషన్‌ కోర్టులో ఉండటంతో విడుదలపై కాస్త సందిగ్ధత నెలకొన్నది. కోర్టు పిటిషన్‌ను డిస్మిస్‌ చేయడంతో ఆగస్టు 11న మెగాస్టార్‌ చిరంజీవి 'భోళా శంకర్' సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ అవ్వనుంది.

భోళా శంకర్‌ చిత్ర విడుదలను ఆపాలంటూ విశాఖపట్నంకు చెందిన గాయత్రి ఫిలిం డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ అలియాస్ బత్తుల సత్యనారాయణ కోర్టుకు ఎక్కారు. భోళా శంకర్‌ చిత్ర నిర్మాత సుంకర అనిల్ తమను రూ.30 కోట్ల మేరకు మోసం చేశాడని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో విడుదలైన ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక‍్కుల్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఐదేళ్ల పాటు గాయత్రి ఫిలిమ్స్‌కు కేటాయిస్తూ అనిల్‌ సుంకర అగ్రిమెంట్ రాసిచ్చారనీ.. అందుకు తన నుంచి రూ.30 కోట్లు తీసుకుని మోసం చేశారని దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాక దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెప్పారు బత్తుల సత్యనారాయణ.

'ఏజెంట్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే ఇచ్చి, అగ్రిమెంట్ బ్రేక్ చేశారని బత్తుల సత్యనారాయణ తెలిపారు. ఆ తర్వాత 'సామజవరగమన' వైజాగ్ హక్కులు తనకు ఇచ్చారని కానీ అందులో కొద్ది డబ్బు మాత్రమే కవర్ అయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు రావాల్సిన రూ.28.30 కోట్లు ఇప్పుడే చెల్లించాలని గాయత్రి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పట్టు బట్టింది. ఈ వివాదంపై రెండ్రోజుల పాటు ఇరుపక్షాల వాదనలు జరిగాయి. తమ ప్రతి సినిమాలోనూ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని గాయత్రి ఫిలిమ్స్‌కు ఇస్తున్నామని ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ వాదించింది.

అయితే.. 'భోళా శంకర్' సినిమాలో మొత్తం రూ.120 కోట్లు పెట్టామని తెలిపారు. ప్రీ బిజినెస్‌ రూ.60 కోట్లు జరగ్గా.. మిగతావి రావాల్సి ఉందని తెలిపారు. ఇక ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత గాయత్రి ఫిలిమ్స్‌ దాఖలుచేసిన పిటిషన్‌ను సిటి సివిల్ కోర్టు డిస్మిస్ చేసింది. దాంతో యథావిధిగా 'భోళా శంకర్' సినిమా విడుదల కానుంది. దాదాపు పదేళ్ల తర్వాత దర్శకుడు మెహర్‌ రమేశ్‌ తెరకెక్కించిన చిత్రమిది. తమిళంలో విజయవంతమైన ‘వేదాళం’ ఆధారంగా రూపొందించారు. మెగాస్టార్‌ పక్కన హీరోయిన్‌ తమన్నా, ఆయనకు చెల్లిగా కీర్తి సురేశ్‌ నటించారు. సుశాంత్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు లైన్‌ క్లియర్ అవ్వడంతో థియేటర్లలో చూసేందుకు మెగా అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు.

Next Story