కోలీవుడ్‌ ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత

కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ హాస్యనటుడు బోండా మణి కన్నుమూశారు.

By Srikanth Gundamalla  Published on  24 Dec 2023 5:03 PM IST
kollywood, comedian, bonda mani, death,

కోలీవుడ్‌ ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత

కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ హాస్యనటుడు బోండా మణి కన్నుమూశారు. బోండా మణి శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో తన ఇంట్లో హఠాత్తుగా కుప్పకూలిపోయారు. పల్లవరం దగ్గరున్న బోజిచలూరులోని ఇంట్లో ఉండగా ఆయన కుప్పకూలారు. దాంతో.. గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే అంబులెన్స్‌లో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. బోండా మణిని పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. దాంతో.. కోలీవుడ్‌లో విషాద చాయలు అలుముకున్నాయి. బోండా మణి వయసు 60 సంవత్సరాలు. బోండా మణి మృతిపట్ల సినీ ప్రముఖులతో పాటు.. అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. అలాగే భగవంతుడు ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నారు.

శ్రీలంకలో జన్మించిన బోండా మణి తమిళ సినిమా ఇండస్ట్రీలో చిన్నచిన్న పాత్రలో తన కెరీర్‌ను మొదలుపెట్టారు. ఆ తర్వాత కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. భాగ్యరాజ్‌ హీరోగా 1991లో వచ్చిన 'పౌను పౌనుటన్‌' సినిమాలో తొలిసారి తమిళన ఇండస్ట్రీలో నటించారు. ఆ తర్వాత ‘సుందర్ ట్రావెల్స్, మరుదమలై, విన్నర్, వేలాయుతం, జిల్లా’.. ఇలా దాదాపు 175కి పైగా చిత్రాలలో నటించారు. స్టార్‌ కమెడియన్‌ వడివేలుతో కలిసి బోండా మణి చేసిన వివిధ హాస్య సన్నివేశాలు అందరినీ ఎంతో అలరించాయి.

కొంతకాలంగా బోండా మణి అనారోగ్యంతో బాధపడుతున్నారు. అంతేకాక.. ఆయన ఆర్థిక పరిస్థితులు కూడా సరిగ్గా లేవని తెలిసింది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సమయంలో ఆయనకు డయాలసిస్‌ చేయించుకోవడానికి కూడా డబ్బుల్లేవనే వార్తలు వచ్చాయి. దాంతో స్పందించిన కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటులు బోండా మణికి సాయం చేశారు. దాంతో.. ఆయన చికిత్స చేయించుకుంటున్నారనీ.. కోలుకుంటున్నారనే వార్తలూ వచ్చాయి. కానీ.. శనివారం రాత్రి ఉన్నట్లుండి కుప్పకూలి హఠాన్మరణం చెందడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.


Next Story