దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం ప్రేక్షక హృదయాలను కలిచి వేసింది. పునీత్ కుటుంబ సభ్యుల మనసులను నేటికీ బాధ పెడుతూనే ఉంది. అయితే, పునీత్ కి ఘన నివాళి ఇచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం తమ రాష్ట్ర అత్యున్నత పురస్కారంతో సత్కరించబోతుంది. 'కన్నడ రాజ్యోత్సవ' పేరుతో ప్రతి ఏడాది నవంబర్ 1న కర్ణాటక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. పైగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురస్కారాలను ప్రదానం చేస్తారు.
ఈ ఏడాది పునీత్‌కు 'కర్ణాటక రత్న' పురస్కారం ఇవ్వబోతున్నారు. ఇందుకోసం భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరు అవుతున్నాడు. ఎన్టీఆర్ కి పునీత్ రాజ్ కుమార్ కి మధ్య మంచి అనుబంధం ఉంది. పునీత్ కోసం ఎన్టీఆర్ ఒక చిత్రంలో పాట కూడా పాడాడు. కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నాడు. రజనీకాంత్ తో ఎన్టీఆర్ వేదిక పంచుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది. బెంగళూరులోని విధాన సౌధలో నవంబర్ 1న 'కన్నడ రాజ్యోత్సవ' జరగనుంది. నిజంగా పునీత్ ఈ అవార్డుకు నిజమైన అర్హుడు.
కన్నడ పవర్ స్టార్ గా పునీత్ రాజ్ కుమార్ ఎదిగి, తన తండ్రి రాజ్ కుమార్ కి నిజమైన వారసుడు అనిపించాడు. పైగా తన జీవితం మొత్తంలో ఏ మచ్చ లేని వ్యక్తి గా 'పునీత్ రాజ్ కుమార్' నిలవడం ఆయన గొప్పతనం. కన్నడ సినీ ఇండస్ట్రీలో పునీత పేరిట ఉన్నన్ని రికార్డ్స్ మరో ఏ హీరోకి లేవు అంటే అతిశయోక్తి కాదు. పునీత్ కెరీర్ లో మరో గొప్ప విషయం..1985లోనే 'బెట్టాడు హూవి'చిత్రంతో బాలనటుడిగా కన్నడ వెండితెరకు పరిచయం అయ్యాడు. ఉత్తమ బాలనటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు. ఈ ఘనత ఇప్పటికీ కర్ణాటకలో గొప్ప రికార్డు గానే మిగిలిపోయింది.