బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌కు శివసేన ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మాటల యుద్దం కొనసాగుతోంది. సుశాంత్ సింగ్ మరణం వెనుక మహారాష్ట్రలో కొలువుదీరిన శివసేన సర్కార్ హస్తం ఉందని.. వారే సుశాంత్ హత్యను తొక్కిపెడుతున్నారని కంగనా అప్పట్లో నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. దీంతో శివసేన మండిపడడం.. ఆమెకు వార్నింగ్ ఇవ్వడం.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏకంగా కంగనకు వై కేటగిరి భద్రత కల్పించడం ఇలా వరుస పరిణామాలు సెగలు రేపాయి.
ఈ క్రమంలోనే ప్రతీకార చర్యగా ముంబై బాంద్రాలోని కంగనా ఆఫీసు అక్రమమంటూ బీఎంసీ(బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) కూల్చివేయడం జరిగింది. తన ఆపీసు కూల్చివేతకు కంగనా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై నేడు హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. చట్టప్రకారం నిర్మించిన భవనాన్ని చట్ట విరుద్ధంగా కూల్చివేశారని తాజాగా హైకోర్టు మండిపడింది. పిటీషనర్ కు జరిగిన నష్టాన్ని చెల్లించాలని ముంబై మున్సిపాలిటీని ఆదేశించింది.
బీఎంసీ అధికారులు కూల్చివేయడాన్ని నిరసిస్తూ కంగనా చేసిన న్యాయ పోరాటం ఫలించినట్టైంది. కూల్చివేతపై ఇప్పటికే హైకోర్టు స్టే విధించింది. ఇప్పుడు సుధీర్ఘ వాదనలు అనంతరం హైకోర్టు శుక్రవారం తుది తీర్పును ఇచ్చింది. కంగనా కార్యాలయాన్ని చట్ట విరుద్ధంగా కూల్చివేశారని తీర్పులో వెల్లడించారు. మహారాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టులో పోరాడి మొత్తానికి కంగనా గెలిచింది.