విజయ్ ను దాటేసిన లోక నాయకుడు
కమల్ హాసన్ నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన సినిమా అంటే చాలు ఎంతో నేర్చుకోవచ్చని అందరూ ఎదురుచూస్తూ ఉంటారు
By M.S.R
కమల్ హాసన్ నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన సినిమా అంటే చాలు ఎంతో నేర్చుకోవచ్చని అందరూ ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి నటుడికి కూడా కమర్షియల్ సక్సెస్ ఒకానొక సమయంలో దక్కలేదు. రజనీకాంత్ భారీ మార్కెట్ ను సొంతం చేసుకున్నా.. కమల్ మాత్రం ఎందుకో వెనుకబడ్డాడని అందరూ భావించారు. ఇక తమిళనాడు చిత్ర పరిశ్రమలో దళపతి విజయ్ వీరందరికంటే మంచి మార్కెట్ ను సొంతం చేసుకుని.. అందరికీ అందనంత ఎత్తు ఎదిగిపోయాడు. తెలుగులో కూడా విజయ్ మంచి మార్కెట్ ను సొంతం చేసుకున్నాడు.
అయితే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ (2022) కమల్ కు కమర్షియల్ బ్లాక్ బస్టర్ వచ్చింది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం రజనీకాంత్ చిత్రాలను అధిగమించి అద్భుతంగా ఆడింది. కమల్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడని చెప్పొచ్చు. ఆయన తర్వాతి వెంచర్ 'థగ్ లైఫ్' కు భారీ ఆఫర్ దక్కింది. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ డ్రామా చిత్రంపై భారీ అంచనాలు ఉండడంతో మంచి మార్కెట్ ఏర్పడింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో నాయకన్ (1987) సినిమా వచ్చింది. తాజా అప్‌డేట్ ప్రకారం.. థగ్ లైఫ్ ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 63 కోట్లకు అమ్ముడయ్యాయి. ‘ఏపీ ఇంటర్నేషనల్’, ‘హోమ్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్’ ఈ సినిమాను సొంతం చేసుకున్నాయి. విజయ్ నటించిన లియో (2023)ని కూడా అధిగమించి.. భారీ ఎత్తున ఓవర్సీస్ డీల్ ను సొంతం చేసుకుంది. ఆ విధంగా కమల్.. విజయ్ రికార్డును బ్రేక్ చేశాడు.