లీకులపై ‘కల్కి 2898 AD’ చిత్ర నిర్మాతల సీరియస్ వార్నింగ్

ఇటీవల సినిమా నుంచి ప్రభాస్‌కు సంబంధించిన ఒక ఫొటో లీక్‌ అయ్యింది. దీన్ని సినిమా నిర్మాతలు సీరియస్‌గా తీసుకున్నారు.

By Srikanth Gundamalla  Published on  21 Sept 2023 8:15 PM IST
Kalki 2898 AD Movie, Prabhas, vyjayanthi movies, warning,

లీకులపై ‘కల్కి 2898 AD’ చిత్ర నిర్మాతల సీరియస్ వార్నింగ్

స్టార్ హీరో ప్రభాస్‌ నటిస్తోన్న తాజా చిత్ర ‘కల్కి 2898 AD’. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్‌, సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే..ఈ సినిమాకు లీకుల బెడద ఎక్కువ అవుతోంది. కొన్నిరోజుల ముందు సినిమా సెట్స్‌ నుంచి ఫొటోలు లీక్‌ అవ్వగా.. ఇటీవల సినిమా నుంచి ప్రభాస్‌కు సంబంధించిన ఒక ఫొటో లీక్‌ అయ్యింది. దాంతో.. కల్కి సినిమా నిర్మాతలు సీరియస్‌గా తీసుకున్నారు.

‘కల్కి 2898 AD’ సినిమాను వైజయంతి మూవీస్‌ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. లీకుల అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న నిర్మాణ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. కాపీరైట్‌ నోటీసును విడుదల చేస్తూ.. ‘కల్కి 2898 AD’ మూవీకి పని చేస్తున్న అన్ని భాగాలు కాపీరైట్‌ చట్టాల ద్వారా నడుస్తున్నాయని పేర్కొంది. నిర్మాణ సంస్థ మాత్రమే అధికారికంగా విడుదల చేసేందుకు హక్కులు ఉన్నాయని.. తమ ప్రమేయం లేకుండా ప్రజలకు తెలియాలని లీకులు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని వార్నింగ్‌ ఇచ్చింది.

ప్రభాస్ నటిస్తోన్న ‘కల్కి 2898 AD’ సినిమా నుంచి ఫొటోలు, వీడియోలు తమకు తెలియకుండా లీక్ చేస్తే కఠిన శిక్ష తప్పదని పేర్కొంది వైజయంతి మూవీస్. సైబర్ పోలీసుల సహకారంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సోషల్‌ మీడియా ద్వారా నోటీసుల్లో వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే కల్కి మూవీకి సంబంధించిన గ్లింప్స్‌ విడుదల కాగా..అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రపంచాన్ని దుష్ట శక్తుల నుంచి కాపాడే కల్కి అవతారంలోనే ప్రభాస్ కనిపించబోతోన్నాడు. ఇక ఇది టైం ట్రావెల్ కథగా తెలుస్తున్నది. ఇందులో ఏకంగా 2898వ సంవత్సరానికి వెళ్లేట్టు కనిపిస్తుండగా.. ఇందులో ప్రభాస్ కల్కి అవతారంలో ప్రపంచాన్ని కాపాడే దేవుడిలా కనిపించబోతున్నట్లు సమాచారం

‘కల్కి 2898 AD’ సినిమాలో లోక నాయకుడు కమల్‌ హసన్‌, బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కీలకపాత్రలు పోషించనున్నారు. ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Next Story