జానీ మాస్టర్‌పై పోక్సో కేసు నమోదు.. పోలీసుల గాలింపు
లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఊహించని షాక్ ఎదురైంది.
By Srikanth Gundamalla Published on 18 Sept 2024 3:57 PM ISTలైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఊహించని షాక్ ఎదురైంది. నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మైనర్ గా ఉన్నప్పటి నుంచే జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దాంతో.. పోలీసులు ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కాగా.. ప్రస్తుతం జానీ లడఖ్‌కు పారిపోయినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే జానీ మాస్టర్ వ్యవహారం టాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు లేడీ కొరియో గ్రాఫర్ పై అత్యాచారం చేశారని ఆరోపణపై రేప్ కేసు నమోదు చేశారు. సదరు లేడీ కొరియోగ్రాఫర్ మైనర్ గా ఉన్న సమయంలోనే ముంబైకి పిలిపించి హోటల్లో అత్యా చారం చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు విచారణ జరిపి జానీ మాస్టర్ పైన పోక్సో కింద కేసు నమోదు చేశారు. విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. మొత్తం నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి జానీ మాస్టర్ కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. నార్త్ ఇండియాలో జానీ మాస్టర్ ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అయితే పోలీస్ లకు బురిడీ కొట్టి జానీ మాస్టర్ అక్కడి నుంచి పారిపోయాడని సమాచారం. ప్రస్తుతానికి జానీ మాస్టర్ కోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు తెలిసింది.