మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం..!
టాలీవుడ్ మెగా హీరో చిరంజీవిని కేంద్ర ప్రభత్వం మరో ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించబోతున్నట్లు తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 18 Jan 2024 9:00 AM ISTమెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం..!
టాలీవుడ్ మెగా హీరో చిరంజీవిని కేంద్ర ప్రభత్వం మరో ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించబోతున్నట్లు తెలుస్తోంది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డును ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. పౌర పురస్కారాల్లో భాగంగా చిరంజీవిని భారత ప్రభుత్వం పద్మ విభూషణ్‌తో సత్కరించే చాన్స్ ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఏడాది పద్మ అవార్డుల జాబితాలో చిరంజీవి పేరు ఉన్నట్లు ఢిల్లీ నుంచి సమాచారం వచ్చిందట. సినిమా పరిశ్రమకు చిరంజీవి ఎన్నో సేవలు అందించారు. మెగాస్టార్ చిరంజీవి అందించిన విశిష్ట సేవలకు మాత్రమే కాదు.. కోవిడ్ -19 సమయంలో ఆయన చేసిన సామాజిక సేవకు గాను చిరంజీవికి ఈ పురస్కారం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ సమయంలో ఆ వైరస్ బారిన పడిన బాధితులను రక్షించడానికి చిరంజీవి అప్పట్లో ఓ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. దీనికి విశేష స్పందన వచ్చింది. ఎందరికో మంచి వైద్యం అందింది. అంతేకాదు.. ప్రజలకు క్లిష్టమైన వైద్య సదుపాయాలను అందించడానికి అప్పట్లో ఆయన అంబులెన్స్ సేవలను కూడా ప్రారంభించారు. ఇక చిరంజీవి బ్లడ్ బ్యాంకు గురించి అందరికీ తెలిసిందే. ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టింది. వీటన్నింటినీ గుర్తించిన భారత ప్రభుత్వం చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మరోవైపు అయోధ్యలో జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ నుంచి మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. అయితే.. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో పాటు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్తారని చెబుతున్నారు. ఇక చిరంజీవికి 2006లోనే పద్మభూషణ్ అవార్డు లభించిన విషయం తెలిసిందే.