టికెట్స్ కొన్నవారే రివ్యూ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి: విశ్వక్‌సేన్
మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ హీరోగా తాజాగా విడుదలైన మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.
By Srikanth Gundamalla Published on 1 Jun 2024 7:48 AM ISTటికెట్స్ కొన్నవారే రివ్యూ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి: విశ్వక్‌సేన్
మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ హీరోగా తాజాగా విడుదలైన మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. మే 31న శుక్రవారం థియేటర్లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. ఈ సినిమాలో మునుపెన్నడూ లేని లుక్‌లో కనిపించాడు విశ్వక్. ఈ మూవీలో విశ్వక్‌సేన్ పక్కన హీరోయిన్‌గా నేహా శెట్టి నటించింది. ఇక అంజలి ముఖ్య పాత్రను పోషించింది. ఈ సినిమాను ఛల్ మోహన్ రంగ సినిమా ఫేమ్ కృష్ణ చైతన్య తెరకెక్కించగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మించారు. ఈ సినిమా కథ పాతది అయినా కూడా దర్శకుడు కృష్ణ చైతన్య తన టేకింగ్ తో అదరగొట్టాడు.
సినిమా ఇండస్ట్రీలో కొంతకాలంగా రివ్యూలపై చర్చ జరుగుతోంది. కొందరు కావాలనే నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారనే వాదన ఉంది. మరోవైపు ఇంకొందరు సినిమా చూడకముందే రివ్యూలు ఇస్తూ సినిమా ఫలితంపై దెబ్బతీస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఇదే అంశంపై హీరో విశ్వక్‌సేన్ కూడా స్పందించారు. ఆయన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు వస్తోన్న రెస్పాన్స్.. రివ్యూపై మాట్లాడారు.
కొందరు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూడకుండానే రివ్యూలు ఇచ్చారని విశ్వక్‌సేన్ చెప్పారు. మ్యూజిక్ బాలేదు అంటూ రివ్యూలో ఉందని అన్నారు. సినిమాకు ప్రధాన బలమే మ్యూజిక్ అనీ.. దాన్నే బాలేదు అన్నారంటే వారు సినిమా చూడలేదని అక్కడే అర్థమైందని విశ్వక్ సేన్ పేర్కొన్నారు. సినిమాను చూసి అందులోని వీక్ పాయింట్‌ను ప్రస్తావిస్తూ రివ్యూస్ రాస్తే తప్పు లేదు కానీ.. ఇలా చూడకుండా రివ్యూ ఇవ్వడం ఏమాత్రం సబబు కాదన్నారు. ఫేక్ రివ్యూస్ సినిమా ప్రొడ్యూసర్లపై ఎఫెక్ట్ చూపుతాయని.. తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. ఈ మేరకు పలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. టికెట్స్ కొన్నవారే 'బుక్‌మై షో'లో రివ్యూలు రాసుకునేందుకు వీలు ఉండేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందన్నారు. గ్యాంగ్స్ గోదావరి సినిమాకు ఉదయం 6 గంటలకే రివ్యూ రాశారని విశ్వక్ గుర్తు చేశారు.