జై భీమ్‌కు అవార్డు రాలేదని నాని నిరాశ, నెట్టింట పెద్ద రచ్చ

జై భీమ్ సినిమాకు అవార్డు దక్కకపోవడం పట్ల న్యాచురల్ స్టార్‌ నానీ కూడా కాస్త నిరాశ చెందారు.

By Srikanth Gundamalla  Published on  26 Aug 2023 12:46 PM IST
Hero Nani, disappoint, jai bhim,  film awards

జై భీమ్‌కు అవార్డు రాలేదని నాని నిరాశ, నెట్టింట పెద్ద రచ్చ

జాతీయ సినిమా అవార్డులను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే... జాతీయ అవార్డులను ప్రభుత్వం ఇలా ప్రకటించిందో లేదో పలువురు విమర్శలు చేయడం కామన్ అయ్యిపోయింది. సోషల్‌ మీడియాలో ఈ సినిమాకు ఎలా అవార్డు ఇచ్చారో.. ఆ సినిమాకు ఎందుకు ఇవ్వలేదో అంటూ పలువురు కామెంట్స్‌ చేస్తున్నారు. కొందరికి సినిమాల గురించి పెద్దగా నాలెడ్జ్‌ లేకపోయినా సరే.. చేతిలో సెల్‌ ఫోన్ ఉంది కదా అంటూ ఇష్టం వచ్చిన రాతలు.. కామెంట్స్‌ పెట్టేస్తుంటున్నారు. అయితే.. అవార్డులు ప్రకటించినప్పుడు అన్ని వర్గాలు సంతృప్తి పడేలా ఉండటం అనేది కష్టమైన విషయమే. దాంతో.. అవార్డులపై పెద్ద రచ్చ చేయడం అనవసరమని నిపుణులు అంటుంటారు.

అన్నీ ఏమోగానీ.. తమిళ సినిమా జై భీమ్‌కు అవార్డు రాకపోవడంపై మాత్రం చాలా వరకు నిరాశ వ్యక్తం చేశారు. అంత మంచి సినిమాను జ్యూరీ ఎలా గుర్తించలేదో తెలియడం లేదంటూ తమిళ తంబీలతో పాటు.. సినీ ప్రేక్షకులు కూడా బాధపడ్డారు. ఈ క్రమంలోనే జై భీమ్ సినిమాకు అవార్డు దక్కకపోవడం పట్ల న్యాచురల్ స్టార్‌ నానీ కూడా కాస్త నిరాశ చెందారు. ఈ మేరకు ఇన్‌స్టా గ్రామ్‌లో ఒక పోస్టు కూడా పెట్టారు. జైభీమ్‌ అని ఓ హార్ట్‌ బ్రేక్‌ సింబల్‌ను పోస్టు చేశారు. అయితే.. నాని అలా పోస్టు పెట్టాడో లేదో విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగు సినిమాను అవమానిస్తున్నారని పలువురు నెటిజన్లు అదేపనిగా నానిని విమర్శిస్తున్నారు. అవార్డుల ప్రకటనలో అంతగా నిరాశ చెందే విషయం ఏముందంటూ ప్రశ్నిస్తున్నారు.

తెలుగు వారంటేనే సినిమా ప్రియులు. సినిమా బాగుంటే చాలు భాషను పట్టించుకోరు. ఎంతో ఆదరిస్తారు. ఆ క్రమంలోనే న్యాచురల్ స్టార్ నాని కూడా జైభీమ్‌ సినిమా గొప్పగా తీశారని.. కానీ దానికి అవార్డు దక్కకపోవడం పట్ల నిరాశ వ్యక్తం చేశాడు. తెలుగు సినిమాల గురించి మాట్లాడకుండా.. తమిళ సినిమాకు అవార్డు గురించి నాని ప్రస్తావించడం కొందరికి మింగుడు పడటం లేదు. ఏదేమైనా ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా స్టార్‌ హీరో స్థాయికి ఎదిగిన నానిపై ఈ రకమైన విమర్శలు తగవంటూ కొందరు సమర్ధిస్తున్నారు. ఇంకొందరు అయితే.. గతంలో నాని చేసిన వ్యాఖ్యలను ఎడిట్ చేసి మరీ ఆయనపై నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా నాని పోస్టు మీదే సోషల్‌ మీడియాలో రచ్చ జరుగుతోంది. మరి ఇది ఎంత వరకు వెళ్తుందో చూడాలి.

Next Story