రాజమౌళి 'ఈగ-2' తీస్తే నా అవసరం లేదన్నారు: నాని
టాలీవుడ్ స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ రాజమౌళి.
By Srikanth Gundamalla Published on 27 Aug 2024 10:36 AM ISTరాజమౌళి ఈగ-2 తీస్తే నా అవసరం లేదన్నారు : నాని
టాలీవుడ్ స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ రాజమౌళి. జక్కన్న ఆయన కెరియర్‌లో తీసిన సినిమాలన్నీ హిట్టే. ముఖ్యంగా రాజమౌళి తీసిన ఈగ సినిమా ఒక రికార్డే అని చెప్పాలి. ఇండియాలో సినిమాలు పెద్దవిజయం సాధించాలంటే స్టార్ హీరోలు అవసరం లేదని నిరూపించారు. కేవలం ఈగతో సినిమా మొత్తం నడిపించాడు. ఒక విజువల్ వండర్‌ను చూపించాడు. అయితే.. ఈగ సినిమా సీక్వెల్ గురించి ప్రస్తుతం మరోసారి చర్చ జరుగుతోంది. హీరో నాని ఈ మూవీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఈగ సినిమా సీక్వెల్ గురించి హీరో నాని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈగ సీక్వెల్ గురించి ఒక సారి రాజమౌళితో తాను మాట్లాడినట్లు వెల్లడించారు. విజయేంద్ర ప్రసాద్ ను తాను ఎప్పుడూ ఈగ సీక్వెల్ గురించి అడగలేదన్నారు. కానీ.. రాజమౌళితో మాత్రం ఒకసారి సరదాగా చర్చించినట్లు చెప్పారు. ఈగ సీక్వెల్ చేస్తామన్నారు కదా. ఎప్పుడు మొదలుపెడదామని అడిగినట్లు నాని చెప్పాడు. దానికి రాజమౌళి మాట్లాడుతూ ఈగ-2 సినిమా చేసినా నీతో అవసరం ఉండదని చెప్పాడన్నారు. ఈగ ఉంటే చాలనీ.. అదే సీక్వెల్‌లో తిరిగి వస్తుందన్నారు. అయితే.. ఈగ సినిమా చేయాలనే ఆలోచన రావడమే గొప్ప విషయం అని హీరో నాని అన్నారు. రాజమౌళి ధైర్యాన్ని మెచ్చుకోవాలన్నారు. ఆయనకు దీని సీక్వెల్ గురించి ఆలోచన వచ్చినప్పుడు కచ్చితంగా ప్రారంభిస్తారని అనుకుంటున్నానని హీరో నాని చెప్పారు. ఇదే జరిగితే మరోసారి ప్రపంచం మొత్తం మన టాలీవుడ్‌వైపు చూడటం పక్కా అన్నారు.
2012లో రాజమౌళి డైరెక్షన్‌లో సమంత, నాని ప్రధాన పాత్రల్లో ఈగ సినిమా వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. సుదీప్ కిచ్చ విలన్‌గా అందరినీ ఆకట్టుకున్నాడు .ఈ మూవీకి ఏకంగా రెండు జాతీయ అవార్డులు, 3 సైమా అవార్డులు, 5 సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కాయి. కాగా.. సరిపోదా శనివారం సినిమాలో తాజాగా హీరో నాని నటించిన విషయం తెలిసిందే.