భార్య చెప్పిన స్టోరీకి దిల్‌రాజ్ ఫిదా..!
Dil Raju's Wife Turns Story Writer .. కరోనా వైరస్ విజృంభణతో చిత్ర పరిశ్రమ తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. లాక్‌డౌన్
By సుభాష్ Published on 3 Dec 2020 2:07 PM IST
కరోనా వైరస్ విజృంభణతో చిత్ర పరిశ్రమ తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. లాక్‌డౌన్ కాలంలో థియేటర్లు మూత పడడంతో.. ప్రేక్షకులు ఓటీటీ వైపు మొగ్గు చూపారు. దీంతో చాలా మంది తమ చిత్రాలను నేరుగా ఓటీటీలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే థియేటర్లు మొదలవుతున్నా.. ప్రేక్షకులు అటువైపు చూడడానికి భయపడుతున్నారు. భవిష్యత్తు దృష్ట్యా నిర్మాతలు చూడా తాము నిర్మించబోయే చిత్రాలను ఓటీటీ వేదికగా విడుదల చేయాలనే ఆలోచనలో పడ్డారు. అందుకనుగుణంగా చిత్ర కథలను సిద్దం చేసుకుంటున్నారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు కథల ఎంపిక విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కథల జడ్జిమెంట్ సూపర్ అంటూ అంతా అంటూ ఉంటారు. ఒక కథను ఆయన ఏదైనా హీరోకు అనుకుంటే అది నిజంగా ఆ హీరో కోసమే రాశారా అన్నట్లుగా అనిపిస్తుంది. ఎలాంటి కథలు ప్రేక్షకులకు నచ్చుతాయి. ఎలాంటి హీరోకు ఎలాంటి కథలు నచ్చుతాయి అనే విషయంలో దిల్ రాజు చాలా క్లారిటీగా ఉంటాడు. అందుకే ఆయన సక్సెస్ రేటు చాలా ఎక్కువ అనేది అందరి మాట. ఇక దిల్ రాజ్ కూడా ఓటీటీ దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలో తగిన కథల కోసం వెతుకుతుంటే.. ఆయన భార్య తేజస్విని చెప్పిన స్టోరీ విని ఫిదా అయ్యారట.
తేజస్విని స్వయంగా ఓ కథను తయారు చేసి, మరిన్ని కథలను కూడా సిద్ధం చేస్తుండగా, వాటికి మరిన్ని మెరుగులు దిద్ది, పక్కాగా స్రిప్ట్ లను తయారు చేయించాలన్న ఉద్దేశంతో రచయితలతో కూడిన బృందాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశారని, తేజస్వినికి వారు సాయపడుతూ, కథలకు పదును పెడుతున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం.దిల్‌రాజు ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఎఫ్3 మూవీ నిర్మాణ బాధ్యతల్లో బిజిబిజీగా ఉన్నారు.